
చకచకా సీఎంఆర్
ఈ నెలాఖరులోగా మిగిలినదీ పూర్తి రేషన్‌షాపుల్లో పంపిణీ నేపథ్యాన ప్రత్యేక దృష్టి గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలకు సిద్ధం
పక్కదారి పట్టకుండా..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో 2024–25 యాసంగికి సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) సేకరణపై పౌర సరఫరాల సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రేషన్‌షాప్‌ల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో గడువులోగా సీఎంఆర్ సేకరించే లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. జిల్లాలో యాసంగిలో 3,06,446.600 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పౌర సరఫరాల సంస్థకు చేరాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 2,44,901.277 మెట్రిక్ టన్నులు అందాయి. అంటే 80 శాతం మేర బియ్యం చేరగా, మిగిలిన బియ్యాన్ని ఈ నెలాఖరులోగా సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోపక్క 2024–25 వానాకాలం సీఎంఆర్ సేకరణ కూడా 98శాతం పూర్తయింది. ఇక 2023–24 ఏడాదిలో సీఎంఆర్ ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడిన మిల్లర్లలో ఇద్దరికి నోటీసులు ఇవ్వగా.. ఇంకో మిల్లర్‌పై కేసు పెట్టారు.
గడువుతో గడిపేస్తూ..
గత కొన్నేళ్లుగా మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగిస్తున్నా మిల్లర్లు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. జిల్లాలో ఏటా పౌరసరఫరాల సంస్థ సుమారు 70 మిల్లులకు ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇస్తోంది. ధాన్యం మర ఆడించాక 67 శాతం బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు అందించాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా గడువులోగా ఇవ్వకపోవడమే కాక సాకులతో కాలం వెళ్లదీస్తున్నారు. 2023–24 సీజన్ వరకు ఇదే పరిస్థితి కొనసాగడంతో అవసరాలకు బియ్యం కేటాయించడం ఇబ్బందిగా మారింది.
యాసంగిలో 80 శాతం
2024–25 ఏడాది వానాకాలంలో 98 శాతం, యాసంగిలో 80 శాతం సీఎంఆర్ సేకరణ పూర్తయింది. యాసంగి సీజన్‌లో మిల్లర్లకు 4,56,167 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగిస్తే అందులో 3,06,446.600 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 2,44,901.277 మెట్రిక్ టన్నులు అందించారు. మిగతా బియ్యాన్ని సైతం ఈనెలాఖరులోగా సేకరించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఆ మిల్లర్లపై చర్యలు..
గతంలో చాలా మిల్లులు గడువులోగా సీఎంఆర్ ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడ్డాయి. 2023–24లో హైదరాబాద్ నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేపట్టడంతో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లుగా తేలింది. దీంతో మిల్లర్లకు జరిమానా విధించినా చెల్లించలేదు. మూడు మిల్లులకు నోటీసులు జారీ చేస్తే రెండు మిల్లుల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. మరో మిల్లుపై ఇప్పటికే కేసు నమోదైంది. అయితే అవకతవకలకు పాల్పడిన మిల్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా అలాంటి చర్యలు తీసుకోలేదు.
సీఎంఆర్ త్వరగా సేకరించేంలా చర్యలు చేపట్టాం. ఇప్పటికే 80 శాతం మేర సన్నబియ్యం అందింది. ఈనెలాఖరు వరకు గడువు ఉన్నందున మొత్తం సేకరిస్తాం. రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో సరిపడా నిల్వ ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీలత, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ
2024–25 రబీ ధాన్యంలో 80 శాతం సేకరణ
ఈ ఏడాది ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అంతేకాక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, వసతిగృహాల్లో భోజనానికి సైతం సన్న బియ్యం అందిస్తున్నారు. ఈనేపథ్యాన గడువులోగా సీఎంఆర్ సేకరించేలా అధికారులు దృష్టి సారించారు. ప్రతినెలా రేషన్ షాపులు, ఇతర అవసరాలకు సన్నబియ్యం పంపిణీ చేయాలంటే ముందస్తుగా నిల్వ చేయడం తప్పనిసరి. దీంతో బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించకుండా గడువులోగా అందించేలా అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే సమయాన మిల్లుల్లో ధాన్యం, బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా పెట్టారు.

చకచకా సీఎంఆర్