
శరవేగంగా భూసర్వే
‘జవహర్’ ఎత్తిపోతల పథకానికి
193.15 ఎకరాల భూమి అవసరం
40మంది ఉద్యోగులతో సర్వే
ఇప్పటికే మొదలైన పంప్‌హౌస్ పనులు
మధిర: మధిర మండలంలోని వంగవీడు సమీపాన వైరా నదిపై నిర్మించే జవహర్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణపై యంత్రాంగం దృష్టి సారించింది. వైరా నదిపై రూ.630 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకం నిర్మించి పైప్‌లైన్ల ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈమేరకు అవసరమైన 193.15 ఎకరాల భూసేకరణకు 40 మంది సిబ్బందితో సర్వే చేయిస్తున్నారు. వైరానదిపై చెక్‌డ్యామ్, ఆ పక్కన పంప్‌హౌస్ నిర్మించి అక్కడి నుంచి మూడు పైపులైన్ల ద్వారా నీరు ఎత్తిపోస్తారు. భూమి నుంచి ఆరు అడుగుల లోపల పైప్‌లైన్లు వేసే క్రమాన మధ్యలో బోర్లు ఉన్నా ఇబ్బంది ఎదురుకాకుండా భూసేకరణకు నిర్ణయించారు. అంతేకాక పైప్‌లైన్ల మరమ్మతులు, నిర్వహణ కోసం ఓ వైపు రోడ్డు నిర్మిస్తారు. ఇప్పటికే పంప్‌హౌస్ పనులు మొదలుకాగా.. పైప్‌లైన్, రహదారికి అవసరమైన భూసేకరణకు కసరత్తు మొదలుపెట్టారు.
మూడు మార్గాల్లో..
వైరా నదిపై పంప్‌హౌస్ నుంచి మూడు మార్గాల్లో పైపులైన్లు వేస్తారు. ఇందులో ఒకటి 11.2 కి.మీ. పొడవుతో నిర్మించి నిధానపురం మేజర్ కెనాల్ 38వ కి.మీ. వద్దకు నీరు చేరుస్తారు. ఇక 26 కి.మీ. పొడవైన రెండో పైప్‌లైన్ ద్వారా జమలాపురం మేజర్ వద్ద ఉన్న కాల్వలోకి నీటిని విడుదల చేస్తారు. అలాగే, మూడో పైప్‌లైన్ 27 కి.మీ. ఉంటుందని.. దీనిద్వారా మైలవరం మేజర్ కెనాల్‌లోకి నీటిని డంపింగ్ చేస్తారు. తద్వారా ఏపీ భూభాగం నుంచి సాగునీరు తీసుకోకుండానే జవహర్ ఎత్తిపోతల ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాల పరిధి చివరి ఆయకట్టుకు నీరందిస్తారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని సాగర్ జోన్–3 నుంచి జోన్–2లోగా మార్చారు. ఎత్తిపోతల పథకం కూడా పూర్తయితే కు ఇన్నాళ్లు చివరి ఆయకట్టుకు నీరందక నష్టపోయిన రైతులకు మేలు జరగనుంది. మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో తమ సాగునీటి కష్టాలు తీరనున్నాయని రైతులు చెబుతున్నారు.
భూసేకరణ
మధిర, ఎర్రుపాలెం మండలాల పరిధిలో 37వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. పైప్‌లైన్ ఏర్పాటుతో పాటు ఇతర పనులకు మొత్తం 193.15 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. మధిర మండలంలో 116.35, ఎర్రుపాలెం మండలంలో 76.20 ఎకరాల భూసేకరణ నిర్ణయించారు. మధిర మండలంలోని వంగవీడులో 19.21, మునగాలలో 20.38, ఆత్కూరులో 16.27, మాటూరులో 25.18, నాగవరప్పాడులో 9.26, సిద్దినేనిగూడెంలో 21.28, ఎర్రుపాలెం మండలంలోని గోసవీడులో 25.37, అయ్యవారిగూడెంలో 12.47, భీమవరంలో 12.31, గుంటుపల్లి గోపవరంలో 3.27, మామునూరులో 25.38 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.

శరవేగంగా భూసర్వే