
డంపింగ్ యార్డ్‌కు స్థలం గుర్తించండి
వైరా: వైరా మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్‌కు అనువైన స్థలాన్ని గుర్తించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ ఆదేశించారు. వైరా మండలం ముసలిమడుగులో స్థలాన్ని అమె తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. అయితే, ఈ స్థలం దూరంగా ఉన్నందున, కొణిజర్ల, తల్లాడ మండలాల్లో రెండెకరాల స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ యు.గురులింగం తదితరులు పాల్గొన్నారు.
యాత్రాదానానికి విరాళాలు అందించండి
ఖమ్మంమయూరిసెంటర్: సామాజిక బాధ్యతలో భాగంగా ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమ ఉద్దేశమని వెల్లడించారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న వారు ప్రత్యేక రోజులు, పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక నిధికి విరాళం ఇస్తే బస్సులు సమకూరుస్తామని తెలిపారు. ఇందుకోసం వ్యక్తులతో పాటు ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలు, ఎన్జీవోలు నగదు సమకూర్చవచ్చని పేర్కొన్నారు. నిరుపేదలనే కాక సభ్యులు, బంధువులు, స్నేహితులను కూడా యాత్రకు తీసుకెళ్లవచ్చని, వివరాల కోసం డిపోల్లో లేదా 040–69440000, 040–23450033 నంబర్లలో సంప్రదించాలని ఆర్‌ఎం సూచించారు.