బోనకల్: బోనకల్ మండలంలోని లక్ష్మీపురంలో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారనే సమాచారంతో మైనింగ్, రెవెన్యూ ఉద్యోగులు గురువారం తనిఖీలు చేపట్టారు. మైనింగ్ ఇన్‌స్పెక్టర్ పాపగంటి నాగరాజు, ఆర్‌ఐ మైథిలి పరిశీలించి భూయజమానులతో మాట్లాడారు. అయితే, తవ్వకాలు చేపట్టిన వారికి సంబంధించి జేసీబీలు మరోచోట ఉండడంతో వివరాలు సేకరించారు. ఈమేరకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు.
‘బీజేపీ, బీఆర్‌ఎస్ భూస్థాపితం బాధ్యత బీసీలదే’
తల్లాడ: రాష్ట్రప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా కేంద్రప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ పేర్కొన్నారు. తల్లాడ మండలం బిల్లుపాడులో గురువారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీతో పాటు, తమ పాలనలో బీసీలను అణచివేసిన బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేసే బాధ్యత బీసీలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో వచ్చే అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడేపల్లి కృష్ణచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివతో పాటు మల్లెల శ్రీనివాస్, మర్రి ప్రసాద్, జొన్నలగడ్డ వె ంకటేశ్వర్‌రావు, రుద్రాక్ష లక్ష్మణాచారి, నరసింహాచారి, వెంకటేశ్వరరావు, దీవెల వెంకటేశ్వర్లు, వెంకటరామయ్య, వీరభద్రరావు, సతీష్, గడ్డంబాను, కూరపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
14న రాష్ట్రస్థాయి మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 14న రాష్ట్రస్థాయి మహిళల వెయిట్ లిఫ్టింగ్ (ఇండియా లీగ్) పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ పోటీలు జరుగుతాయని అధ్యక్ష, కార్యదర్శులు శివ గణేష్, డి.వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఈ పోటీలకు క్రీడాకారులు హాజరుకానున్నారని వెల్లడించారు.
మున్సిపల్ ఉద్యోగుల పేరిట ఫోన్లు
● క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లించాలని సూచన
సత్తుపల్లి: మీ ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసింది.. రెన్యూవల్ కోసం వాట్సప్‌లో పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా నగదు పంపించండి.. పది నిమిషాల్లో రెన్యూవల్ సర్టిఫికెట్ పంపిస్తాం.. అంటూ సత్తుపల్లిలో పలువురు వ్యాపారులకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తున్నారు. సత్తుపల్లికి చెందిన ఎల్.లక్ష్మణ్‌రావు, జ్యోతి, సుభాష్ తదితరులకు గురువారం ఫోన్ రావడంతో మున్సిపల్ కార్యాలయంలో ఆరా తీయగా తమకేం సంబంధం లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ స్పందిస్తూ అపరిచితులు ఫోన్ చేసినా, క్యూ ఆర్ కోడ్ పంపినా స్పందించవద్దని సూచించారు. మున్సిపల్ ఉద్యోగులెవరూ ఇలా చేయరని, వ్యాపారులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ
వైరా: జైళ్లశాఖలో హెడ్ వార్డర్‌గా పనిచేస్తున్న వైరా మున్సిపాలిటీ గండగలపాడుకు చెందిన పి.వెంకటరత్నం ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి పెయింటింగ్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో 28 రాష్ట్రాల నుంచి పలువురు పోటీ పడగా, తెలంగాణ తరఫున పాల్గొన్న వెంకటరత్నం ద్వితీయ బహుమతి సాఽధించాడు. ఉద్యోగం సాధించకముందు వైరాలో రత్న ఆర్ట్స్ నిర్వహించిన ఆయన జాతీయ స్థాయిలో సత్తా చాటడంపై పలువురు అభినందించారు.

అనుమతి లేని మైనింగ్ కట్టడి