ముందు బిల్లులు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

ముందు బిల్లులు ఇవ్వండి

Sep 12 2025 6:25 AM | Updated on Sep 12 2025 6:25 AM

ముందు బిల్లులు ఇవ్వండి

ముందు బిల్లులు ఇవ్వండి

● లేకపోతే పనిచేయలేమంటున్న కాంట్రాక్టర్లు ● నోటీసులు ఇచ్చినా కాన రాని ఫలితం ● ఆర్‌అండ్‌బీ పరిధిలో రోడ్డు పనులకు అంతరాయం

● లేకపోతే పనిచేయలేమంటున్న కాంట్రాక్టర్లు ● నోటీసులు ఇచ్చినా కాన రాని ఫలితం ● ఆర్‌అండ్‌బీ పరిధిలో రోడ్డు పనులకు అంతరాయం

ఖమ్మంఅర్బన్‌: జిల్లాలో రోడ్లు–భవనాల శాఖ పరిధిలో అనేక పనులు నిలిచిపోయాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు నోటీసులు పంపినా చాలా మంది స్పందించకపోవడం గమనార్హం. అధికారులు తరచుగా నోటీసులు ఇస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం తొలుత బిల్లులు చెల్లించాలని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలో కొన్ని రోడ్ల నిర్మాణం ప్రారంభం కాకపోగా.. ఇంకొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.

యంత్రాలు కూడా తరలింపు

ప్రధానంగా ఖమ్మం–ఇల్లెందు రహదారిపై రఘునాథపాలెం నుంచి బూడిదంపాడు వరకు రూ.40 కోట్లతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణం ప్రారంభమైంది. అయితే బిల్లులు విడుదల కానందున కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేసి సామగ్రి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆ రోడ్డుపై వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. ఇల్లెందు–ఖమ్మం రోడ్డుకు సంబంధించి మరమ్మతు పనులు ఆపిన కాంట్రాక్టర్‌కు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదని సమాచారం. సదరు కాంట్రాక్టర్‌ ఇప్పటివరకు చేసిన పనులకు సుమారు రూ.10కోట్ల బిల్లు రావా ల్సి ఉండగా, అందులో కొంత మొత్తమైనా ఇవ్వకపోతే పనులు చేసేది లేదని చెప్పినట్లు సమాచారం.

మిగతా పనులు కూడా....

జిల్లా వ్యాప్తంగా రహదారుల వార్షిక మరమ్మతులు, గుంతల పూడ్చివేత, రోడ్లకు ఇరువైపులా కంచె చెట్ల తొలగింపు పనుల టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడం లేదు. గత రెండేళ్ల క్రితం చేసిన పనులకు బిల్లులు ఇప్పటికీ రాలేదని.. మళ్లీ పనులు చేసి అప్పులు కాలేమంటూ కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వార్షిక పనులు, చిన్న గుంతలు పూడ్చడం, కంపచెట్లు తొలగింపు తదితర పనులన్నీ నిలిచిపోయాయి. జిల్లాలోని సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ఏడెనిమిది మండలాల పరిధిలో పనులు పూర్తి కాగా.. మిగిలిన అన్నిచోట్ల కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఏన్కూరు మండల కేంద్రంలో రూ.3 కోట్లతో నిర్మించాల్సిన డ్రెయిన్ల పనులకు గత ఎన్నికల కంటే ముందే టెండర్‌ అయినా ప్రారంభం కాాలేదు. దీంతో టెండర్‌ గడువు ముగియడం, నోటీసులకు స్పందన రాకపోవడంతో టెండర్‌ను రద్దు చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా నిధులు మంజూరై, టెండర్లు అయిన పనులు నిలిచిపోగా.. రోడ్ల మరమ్మతులు జరగకపోవడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement