
కాలేజీల్లో వసతుల కల్పన
నిరంతరం పర్యవేక్షణ
● ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రూ.2.96కోట్లు ● అక్టోబర్ 15నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పన, అవసరమైన మరమ్మతులపై దృష్టి సారించారు. ఈమేరకు జిల్లాలోని 21 కాలేజీలకు గాను 15కళాశాలల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వం జిల్లాకు రూ.2.96 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో అమ్మ ఆదర్శ కళాశాలల కమిటీల ద్వారా పనులు చేపడుతున్నారు.
‘అమ్మ’ కమిటీల ద్వారా..
ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో చేపట్టిన పనులన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యాన చేపట్టారు. కళాశాలల్లోనూ అదే మాదిరి పర్యవేక్షణకు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీలను నియమించారు. ఈ కమిటీల ద్వారా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పనులు చేపడుతుండగా, కమిటీలతో పాటు గ్రామీణ ప్రాంత కళాశాలల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లోనైతే మున్సిపల్ కమిషనర్లు, విజిలెన్స్ ఆఫీసర్లు, రిసోర్స్ పర్సన్లు పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఈ పనులన్నీ అక్టోబర్ 15వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
15 కళాశాలల్లో పనులు..
రూ.2.96 కోట్ల నిధులతో జిల్లాలోని 15 జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పనులు కొనసాగుతున్నాయి. కళాశాలల్లో అవసరమైన చిన్నచిన్న మరమ్మతులతో పాటు టాయిలెట్ల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పన, సైన్స్ ల్యాబ్‌ల్లో సామగ్రి కొనుగోలు, రంగులు వేయించేందుకు ఈ నిధులు వెచ్చిస్తున్నారు. కాగా, జిల్లాలోని 15 కాలేజీలకు నిధులు మంజూరు కాగా.. అత్యధికంగా కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.30లక్షలు మంజూరయ్యాయి. అలాగే, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.28.6 లక్షలు, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు జూనియర్ కాలేజీకి రూ.26 లక్షలు, కారేపల్లి కళాశాలకు రూ.20.5 లక్షలు కేటాయించారు.
జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అన్ని పనులు అక్టోబర్ 15లోగా పూర్తి చేయాలని నిర్ణయించాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కాలేజీల్లో అవసరాలను గుర్తించి నిధులు వెచ్చించేలా ప్రణాళిక రూపొందించాం.
– రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి

కాలేజీల్లో వసతుల కల్పన