
చరిత్రను వక్రీకరిస్తే జాతి క్షమించదు..
ఖమ్మంమయూరిసెంటర్: చరిత్రను వక్రీకరించాలని ఎవరు యత్నించినా తెలంగాణ జాతి క్షమించదని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని మతపరమైన పోరాటంగా చిత్రీకరించేందుకు బీజేపీ యత్నిస్తోందని.. కానీ స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ పోరాటంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను గురువారం ఖమ్మంలో నల్లమల గిరిప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం హేమంతరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచచ్చాక నిజాం స్వాతంత్ర రాజుగా ప్రకటించుకుంటే రావి నారాయణరెడ్డి, ముగ్దుం మోహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలిపారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన మహత్తర పోరాటంలో సామాన్యులు సాయుధులై ముందుకు సాగారని, నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులయ్యారని చెప్పారు. భూమి, భూక్తి, విముక్తి కోసం సాగిన ఈ పోరాటంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారని తెలిపారు. అయితే, సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలనే విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకే వైఖరితో ఉండటం దురదృష్టకరమన్నారు. ఈమేరకు నాటి సాయుధ పోరాట ఘట్టాలను నేటి తరానికి తెలియజేసేలా సీపీఐ ఆధ్వర్యాన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు బాగం తెలిపారు. తొలుత అంబేడ్కర్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్.కే.జానీమియా, కొండపర్తి గోవిందరావు, కార్పొరేటర్ బీజీ.క్లెమెంట్‌తో పాటు మహ్మద్ సలాం, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, రావి శివరామకష్ణ. తోట రామాంజనేయులు, మిడికంటి వెంకటరెడ్డి, ఇటికాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సాయుధ పోరాట వారోత్సవాలను
ప్రారంభించిన బాగం