
గుంతలో పడి వ్యక్తి మృతి
మధిర: రోడ్డు పక్కన ఉన్న లోతైన గుంతలో పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మధిర హనుమాన్ కాలనీకి చెందిన ఉప్పతల జమలయ్య(45) బోనకల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఇనుప బీరువాల తయారీ పనిచేస్తున్నాడు. బుధవారం ఆయన మధిర వడ్డెర కాలనీలో ఫంక్షన్‌కు హాజరై తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబీకులు గాలిస్తుండగా గురువారం ఉదయం గుంతలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్న క్రమాన మద్యం మత్తులో రోడ్డు పక్కన నీటి గుంతలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. అయితే, సెల్‌ఫోన్‌తో పాటు నగదు రోడ్డుపై ఉండడంతో మద్యం మత్తులో పడ్డాడా, ఇతర కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మధిర టౌన్ ఇన్స్‌పెక్టర్ రమేష్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
తిరుమలాయపాలెం/రఘునాథపాలెం: తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువులోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో గురువారం టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ రఘు ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని రూ.30,520 నగదు, కారు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించగా కేసు నమోదు చేశారు. అలాగే, రఘునాథపాలం మండలం కొర్లబోడు తండాలోనూ తనిఖీలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట ఆడుతున్న ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారు కాగా, పట్టుబడిన వారి నుంచి రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
సాగర్ కెనాల్‌లో మృతదేహం
ఖమ్మంక్రైం: ఖమ్మం వేణుగోపాల్ నగర్ వద్ద సాగర్ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి(40) మృతదేహన్ని గుర్తించారు. తెలుపు, నలుపు అడ్డగీతల టీషర్ట్, కాటన్ ప్యాంట్‌తో ధరించిన వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిందని ఖమ్మం టూ టౌన్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు సీఐ బాలకృష్ణ వెల్లడించారు.