
గుంతలో నగలు.. అవసరమైతే అమ్మకం
ఖమ్మంక్రైం: జైలుకు వెళ్లివచ్చినా తీరు మార్చుకోకుండా రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి చోరీ సొత్తు గుంతలో దాచి అవసరమైనప్పుడు అమ్ముతూ విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఈమేరకు నిందితుడిని ఖమ్మం జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేయగా వివరాలను గురువారం వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ నాగేల్లి వరకుమార్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చోరీల బాట ఎంచుకున్నాడు. రైళ్లల్లో ప్రయాణిస్తూ, ప్లాట్‌ఫాంపై తిరుగుతూ ఆదమరిచి ఉండే ప్రయాణికుల వద్ద చోరీకి పాల్పడుతున్నాడు. గతంలో ఓసారి జైలుకు వెళ్లి వచ్చినా మార్పు రాలేదు. ఖమ్మం స్టేషన్‌లో గురువారం జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకోగా చోరీల విషయం బయటపడింది. దీంతో ఆయన నుంచి 10గ్రాములు బంగారు నెక్లెస్ స్వాధీనం చేసుకున్నారు. తొలుత చోరీ నగలపై ఆరా తీయగా ఇంట్లో దాచినట్లు వరప్రసాద్ చెప్పినా దొరకలేదు. తిరిగి తోతుగా విచారించడంతో ఇంటి వెనుక గుంతలో పెట్టినట్లు ఒప్పుకున్నాడు. డబ్బు అవసరమైనప్పుడు ఒక్కో ఆభరణం తీసి అమ్ముతున్నట్లు అంగీకరించాడు. ఇప్పటివరకు వరప్రసాద్ చోరీ చేసిన సొత్తు విలువ రూ.8.50లక్షలు ఉంటుందని జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సీఐలు అంజలి, సురేష్‌గౌడ్ తెలిపారు. ఈసమావేశంలో ఎస్‌ఐ సురేష్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న
నిందితుడి అరెస్ట్