
జీపీఓలు వచ్చేస్తున్నారు..
ఖమ్మం సహకారనగర్: రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో సేవలు అందించేందుకు గ్రామ పాలనా అధికారులు (జీపీఓ) నేటి నుంచి విధుల్లోకి రానున్నారు. రెండు రోజుల క్రితం జీపీఓలకు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందించగా.. కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 380 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వీటిని 299 క్లస్టర్లుగా విభజించారు. అయితే జీపీఓలు 252 మంది ఉన్నారు. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి 13 మంది జిల్లాకు వస్తుండగా.. సుమారు 10 మంది ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 299 క్లస్టర్లకు 252 మంది జీపీఓలు ఉంటుండగా.. 56 మంది జూనియర్ అసిస్టెంట్లను జీపీఓల సేవలకు వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నేడు అందనున్న ఆర్డర్లు..
జీపీఓల కౌన్సెలింగ్ బుధవారం రాత్రి వరకు నిర్వహించగా వారికి గురువారం ఉత్తర్వులు అందించనున్నారు. అయితే గురు, శుక్రవారాల్లో వారు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
పైరవీలకు ఆస్కారం లేకుండా పోస్టింగ్‌లు
పైరవీలకు, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా మెరిట్ పద్ధతిలో గ్రామ పరిపాలనా అధికారులకు కౌన్సిలింగ్ చేపట్టి, పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పరిపాలనా అధికారులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం గ్రామ పరిపాలనా అధికారులను నియమించిందన్నారు. జిల్లాలో పరీక్ష ద్వారా 252 మంది అర్హులైన వారికి మెరిట్ ప్రకారం వారి సొంత మండలం మినహాయించి, ఇతర ప్రదేశాల్లో పోస్టింగ్‌లు ఇస్తున్నామన్నారు. ప్రజావాణిలో, గ్రామాల సందర్శన సందర్భంగా ఎక్కువగా భూ సమస్యలపైనే దరఖాస్తులు వస్తున్నాయని, వీటిని పరిష్కరించే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. భూ భారతి చట్టం పటిష్ట అమలుకు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ.పద్మశ్రీ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.