
పిడుగుపాటుతో రైతుకు గాయాలు
కామేపల్లి: పిడుగుపాటుతో ఓ రైతు తీవ్రంగా గా యపడిన ఘటనమండలంలో బుధవారం చోటు చేసుకుంది. కొమ్మినేపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ భావ్‌సింగ్ మిరప తోటలో పని చేస్తుండగా సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలోనే భావ్‌సింగ్ సమీపంలోనే పిడుగు పడడంతో షాక్ కు గురై కిందపడిపోయాడు. పిడుగు ప్రభావంతో చర్మం కాలిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. పొరుగున ఉన్న రైతులు అతడిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
గడ్డిమందు తాగిన వ్యక్తి మృతి
ఖమ్మంఅర్బన్: గడ్డిమందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై బుధవారం ఖమ్మంఅర్బన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నేలకొండపల్లి మండలం చెరువుమాధారానికి చెందిన కాటం గోపిరెడ్డి(31) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ఉద్యోగం చేస్తున్నాడు. మూడురోజుల క్రితం ఆయన గడ్డిమందు తాగగా కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఖమ్మంలోని మమతఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవా రం మృతిచెందాడు. మృతుడి తండ్రి వెంట్రామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. కాగా, ఘటన హైదరాబాద్‌లో జరిగినందును కేసును అక్కడికి బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు.
దాడి చేశారని ఫిర్యాదు
ఖమ్మంఅర్బన్: చెత్త తరలించే ప్రైవేట్ వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని ఓ వ్యక్తి డయల్ –100కు కాల్ చేయడంతోపాటు సీపీకి సైతం బుధవారం ఫిర్యాదు చేశాడు. నగరంలోని శ్రీనగర్‌కాలనీ రోడ్డు నంబర్–1లో నివాసం ఉండే రంగిశెట్టి నాగేందర్ ఇంటి పక్కన, సమీపంలో కాలనీవాసులు చెత్త వేస్తుంటారు. ఈ క్రమంలో చెత్త సేకరించే ప్రైవేట్ వాహనంలో వచ్చిన వ్యక్తులు వచ్చి తమకు చెత్త వేస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఇలా వేస్తున్నారా? అంటూ అసభ్యకరంగా దూషిస్తూ తనపై, తల్లి ప్రమీలపై దాడికి పాల్పడినట్లు నాగేందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.