పనుల్లో జాప్యాన్ని సహించం | - | Sakshi
Sakshi News home page

పనుల్లో జాప్యాన్ని సహించం

Sep 11 2025 2:52 AM | Updated on Sep 11 2025 2:52 AM

పనుల్లో జాప్యాన్ని సహించం

పనుల్లో జాప్యాన్ని సహించం

● మెడికల్‌ కళాశాల, ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణాలు వేగవంతం చేయాలి ● కలెక్టర్‌ అనుదీప్‌

నిబంధనల ప్రకారం లే ఔట్‌ అనుమతులు

● మెడికల్‌ కళాశాల, ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణాలు వేగవంతం చేయాలి ● కలెక్టర్‌ అనుదీప్‌

ఖమ్మంఅర్బన్‌/రఘునాథపాలెం: నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ఇంటిగ్రేటెడ్‌ గురుకుల పాఠశాల పనులను కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, అదనపు కలెక్టర్‌ శ్రీజ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ.. పనుల్లో జాప్యం తగదని సూచించారు. ప్రారంభానికి ముందే అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యత లోపం ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. రూ. 200 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల డిజైన్‌ కూడా మంచి మోడల్‌గా ఉండాలని, వాస్తును పాటిస్తూ అకరణీయంగా ఉండేలా తీర్చి దిద్దాలని అన్నారు. గురుకుల పాఠశాల నిధులు తన అకౌంట్‌లో నిల్వ ఉన్నాయని, బిల్లుల జాప్యం పేరుతో పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదని అన్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు ఇస్తామని, పార్ట్‌ బిల్లు చేసిన 24 గంటల్లో చెల్లిస్తామని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పన, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్‌, రహదారుల వంటి పనులు సైతం పూర్తి చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాల ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. మెడికల్‌ కళాశాలలో ఇప్పటి వరకు రూ. 45 కోట్ల విలువైన పనులు పూర్తి చేయగా రూ.15 కోట్ల బిల్లులు అందించామని చెప్పారు. కాలేజీలో అంతర్గత రహదారులు, ప్రహరీ, డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ పవార్‌, డీఈ లక్ష్మీనాయక్‌, ఏఈఈ లలిత, ఖమ్మం అర్బన్‌, రఘునాథపాలెం తహసీల్దార్లు సైదులు, శ్వేత, ఎంఈఓ రాములు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మానుకొండ రాధాకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

జవాబుదారీతనంతో పనిచేయాలి

ఖమ్మం సహకారనగర్‌ : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ శ్రీజతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల నిర్వహించిన పైలట్‌ ప్రజావాణి కార్యక్రమం తరహాలో మధిర నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లోనూ నిర్వహణకు కార్యాచరణ చేపట్టామని, ఈ కార్యక్రమం అమలులో అధికారులు జవాబుదారీగా ఉండాలని అన్నారు. మండల స్థాయిలోనే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నారు. అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ మాట్లాడుతూ పైలట్‌ ప్రజావాణి కా ర్యక్రమం కింద మండల కేంద్రంలోని ఐఎఫ్‌సీ సెంటర్‌లో సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి రశీదు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, అధికారులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు కరీనా, శ్రీహర్ష, అఖిల్‌ సూర్య పాల్గొన్నారు.

ఖమ్మంమయూరిసెంటర్‌: నగరంలో లేఔట్‌ అనుమతుల జారీ అంశంలో నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన లేఔట్‌ కమిటీ సమావేశంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేర భూమి లే ఔట్‌ లో కేటాయించేలా అధికారులు పరిశీలించాలని అన్నారు. నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌డీసీ ఎం. రాజేశ్వరి, సుడా సీపీఓ, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ వెంకట్‌ రెడ్డి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసా చారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, ఈఈ తానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement