
ఉప్పొంగిన గంగ!
జిల్లాలో భూగర్భ జలాల లభ్యత ఇలా (మీటర్లలో)
జిల్లాలో 1.5 మీటర్ల మేర పెరిగిన భూగర్భ జలాలు
గతేడాది కంటే మరింత దగ్గరగా..
పొదుపుగా వినియోగిస్తే మేలంటున్న అధికారులు
ఖమ్మం సహకారనగర్: గత రెండళ్లుగా భూగర్భ జలాలు పైకి వస్తున్నాయి. జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి కూడా జలాలు వస్తుండమే దీనికి కారణమని అంటున్నారు. భూగర్భ జలాలు పెరుగుతున్న క్రమంలో కొంత మేర తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రతీనెలా కొద్దికొద్దిగా..
జిల్లాలోని 21 మండలాల్లో గత నాలుగు నెలలుగా భూగర్భ జలాలను పోలిస్తే ప్రతీ నెలలోనూ గతం కంటే ఈ సంవత్సరం పైకి చేరుకున్నాయి. 2024 మేలో 7.30 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఈ ఏడాది 5.89 మీటర్ల లోతులోనే ఉన్నాయి. అంటే సుమారు 1.50 మీటర్ల మేర పైకి చేరాయి. గతేడాది జూన్‌లో సరాసరి 6.99 మీటర్లు ఉంటే ఈ ఏడాది 5.69 మీటర్లకు చేరాయి. 2024 జూలైలో 4.59 మీటర్ల లోతులో ఉంటే ఈ ఏడాది 3.87 మీటర్ల పైకి చేరాయి. గత ఆగస్టులో 3.10 మీటర్ల లోతులో ఉండగా ఈ ఏడాది ఆగస్టులో 2.72 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు అందుతుండడం విశేషం.
అన్ని మండలాల్లోనూ ఆశాజనకమే..
జిల్లాలోని ప్రతీ మండలంలో భూగర్భజలాలు పెరిగాయి. గతంలో ఒకటి, రెండు మండలాల్లో ఎక్కువ ఉండగా.. ఈసారి మాత్రం అన్ని మండలాల్లోనూ ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటే భవిష్యత్‌లో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో 3.87 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఆగస్టులో 2.72 మీటర్లకు చేరాయి. దీంతో ఒక్క నెలలోనే సుమారు 1.15 మీటర్ల లోతు భూగర్భజలాలు పైకి చేరాయి.
2025 – 26 సంవత్సరంలో వర్షపాతం 31 శాతం అధికంగా నమోదైంది. అందుకు అనుగుణంగా భూగర్భజలాలు సరాసరి 1.16 మీటర్లు పెరిగాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలి. భూగర్భజలాల సుస్థిరతకు ఇంటింటికీ ఇంకుడు గుంతలు, వ్యవసాయ బోరుబావి దగ్గరలో ఫామ్‌పాండ్ వంటి నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి.
– ఎం.రమేష్, జిల్లా భూగర్భజల శాఖాధికారి
నెల 2024 2025 సరాసరి
పెరుగుదల
మే 7.30 5.89 1.41
జూన్ 6.99 5.69 1.3
జూలై 4.59 3.87 0.72
ఆగస్టు 3.10 2.72 0.38

ఉప్పొంగిన గంగ!