
4,654 ఎకరాల్లో పంటలకు నష్టం
అత్యధికంగా 4,386 ఎకరాల్లో పెసరకే..
బాధిత రైతులు 3,635 మంది..
రూ.4.65 కోట్ల పరిహారం అందించాలని సర్కారకు నివేదిక
ఖమ్మంవ్యవసాయం : జిల్లాలో ఇటీవల భారీగా కురిసిన వర్షాలతో 3,635 మంది రైతులకు చెందిన 4,654 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు బుధవారం రాత్రి వివరాలు వెల్లడించింది. జిల్లాలో వరి, పత్తి, పెసర, ఉద్యాన పంటలు సాగులో ఉన్నప్పటికీ అత్యధికంగా పెసర పంటకు నష్టం వాటిల్లిందని, ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ. 4.65 కోట్లు పరిహారం అందించాలని నివేదికలో పేర్కొంది. పంట నష్టాలకు సంబంధించిన సమగ్ర నివేదికను వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఆగస్టు మూడు, నాలుగు వారాల్లో నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీనికి తోడు ఎగువన కురిసిన వానలతో నదులు, వాగులు, జలాశయాలు ఉప్పొంగాయి. దీంతో వాటి పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఆరంభం నుంచి క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తర్ణాధికారులు పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించి జిల్లా వ్యవసాయ శాఖకు నివేదికలు అందించారు.
10 మండలాల్లో పంటలకు నష్టం
భారీ వర్షాలతో చింతకాని, కొణిజర్ల, తల్లాడ, వైరా, కూసుమంచి, కారేపల్లి, కల్లూరు, ఏన్కూరు, రఘునాథపాలెం, బోనకల్ మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ నివేదికల్లో పేర్కొంది. అత్యధికంగా చింతకాని మండలంలో 1,678 మంది రైతులకు చెందిన 2,255 ఎకరాల్లో, కొణిజర్ల మండలంలో 1,079 మంది రైతులకు చెందిన 1,292 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
అధిక విస్తీర్ణంలో పెసరకు..
చేతికందే దశలో ఉన్న పెసర పంటకు అధిక విస్తీర్ణంలో నష్టం వాటిల్లింది. 3,286 మంది రైతులకు చెందిన 4,386 ఎకరాల్లో పెసర పంటకు నష్టం వాటి ల్లగా ఈ పంటకు రూ. 4,38,63,500 పరిహారానికి వ్యవసాయ శాఖ సిఫార్సు చేసింది. వరి 137 ఎకరాల్లో, పత్తి 121, మినుము 3, టమాట 2, చిక్కుడు 1.20, కాకర ఎకరం, మిర్చి 30 గుంటల విస్తీర్ణంలో నష్టపోయినట్లు వెల్లడించిన అధికారులు.. ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ. 4,65,44,000 పరిహారానికి నివేదిక అందించారు.