
విద్యుత్ సరఫరా, అంతరాయాలపై సమీక్ష
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విద్యుత్ సరఫరా, అంతరాయాలపై టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) రాజు చౌహాన్ బుధవారం ఖమ్మంలో విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ సరఫరాలో తీసుకుంటున్న చర్యలు, అంతరాయాలను అధిగిమిస్తున్న విధానం, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్ స్టేషన్ల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ.. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. విద్యుత్ పరికరాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని, ప్రమాదాలను నియంత్రించాలని తెలిపారు. సమావేశంలో ఖమ్మం సర్కిల్ ఎస్‌ఈ శ్రీనివాసా చారి, ఎస్‌ఏఓ శ్రీధర్, డివిజనల్ ఇంజనీర్లు బాబూరావు, రామారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, రాములు, భద్రు పవార్, టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.