
జీపీఓలతో రెవెన్యూ
గ్రామస్థాయిలో గందరగోళం
జిల్లాలో జీపీఓ(గ్రామ పాలనాధికారులు)ల నియామకంతో గ్రామస్థాయి రెవెన్యూ పాలన కొత్తరూపు సంతరించుకోనుంది. గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి.. వారిని వివిధ శాఖల్లో భర్తీ చేశారు. అందులో ఆసక్తి ఉన్న వారిని ప్రస్తుతం జీపీఓలుగా నియమించారు. దీంతో మరోసారి పాత విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 380 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వీటిని 299 క్లస్టర్లుగా విభజించారు. చిన్న క్లస్టర్లు అయితే రెండేసి, పెద్ద క్లస్టర్ అయితే ఒక్కో క్లస్టర్‌కు ఒక జీపీఓకు పోస్టింగ్ ఇచ్చేలా బుధవారం కలెక్టరేట్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
కొత్త స్థానాల్లోకి పూర్వ వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు
● వీరి నియామకంతో గ్రామపాలనకు పూర్వవైభవం ● క్లస్టర్ల వారీగా 252 మందికి నేడు కౌన్సెలింగ్, పోస్టింగ్
అవినీతికి కారణమని..
గ్రామస్థాయిలో సమస్యలు వస్తున్నాయని, రెవెన్యూ శాఖలో అవినీతి కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందనే కారణంతో 2020లో గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థలను రద్దు చేసింది. ఇక వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంతో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకుండా పోయింది. దీంతో ఏ చిన్నసమస్య వచ్చినా తహసీల్దార్ కార్యాలయాలకే పరిగెత్తాల్సి వచ్చింది.
జీపీఓలుగా నియామకం
ఐదేళ్లుగా గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారులు లేక పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో జీపీఓ(గ్రామపాలనాధికారులు)ల నియామకానికి నిర్ణయించింది. గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్న వారికే జీపీఓలుగా అవకాశం కల్పించారు. ఇందుకోసం పరీక్ష నిర్వహించాక నియామకాలు చేపడుతుండడంతో మళ్లీ గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
జిల్లాలో 252 మందికి అవకాశం
జిల్లాలోని 21 మండలాల పరిధిలో 380 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిని 299 క్లస్టర్లుగా విభజించగా 252 మంది జీపీఓలను నియమించారు. ఇటీవల అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పరీక్షలో ఉత్తీర్ణులైన గ్రామపాలనాధికారులతో సమావేశమై నిర్వర్తించాల్సిన విధులు, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ఆప్షన్ ఫారాలు స్వీకరించిన నేపథ్యాన బుధవారం కలెక్టరేట్‌లో సమావేశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. స్పౌజ్, పీహెచ్‌సీ, మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పోస్టింగ్ ఇస్తారు. అయితే, 299 క్లస్టర్లకు 252 మంది జీపీఓలే ఉన్నారు. దీంతో రెండేసి చిన్న కస్లర్ల బాధ్యత ఒకరికి అప్పగించనున్నారు.
గ్రామస్థాయిలో జీపీఓలదే బాధ్యత
గతంలో గ్రామీణ ప్రాంతం నుంచి సీసీఎల్‌ఏ వరకు రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. అదేస్థాయిలో మరోసారి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో పనిచేసిన వీఆర్‌ఓలకే ప్రభుత్వం జీపీఓలుగా బాధ్యతలు అప్పగిస్తోంది. వీరి నియామకంతో గ్రామస్థాయిలో భూ సమస్యలకు పరిష్కారం సులువవుతుందని భావిస్తున్నారు. జీపీఓలు భూ రికార్డుల నిర్వహణతోపాటు వివిధ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ప్రాథమిక నివేదిక ఇస్తారు. ప్రకృతి వైపరీత్యాల సమయాన ప్రభుత్వం తరఫున ప్రజలకు అండగా నిలుస్తారు. ఎన్నికల సందర్భంగా బీఎల్‌ఓలుగా వ్యవహరిస్తారు. ఓటర్ల జాబితా తయారీలో కీలకంగా పనిచేస్తారు. సంక్షేమ ఫలాలు అమలు చేసేందుకు నివేదికలు అందిస్తారు.
గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేక పలు సమస్యలు పేరుకుపోయి ఇటు ప్రజలు., అటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు మొదలు భూసమస్యల పరిష్కారం వరకు తహసీల్దార్ కార్యాలయాలే దిక్కయ్యాయి. అన్ని సమస్యల పరిష్కారంలో కీలకమైన రెవెన్యూ వ్యవస్థ గ్రామస్థాయిలో నిర్వీర్యం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.