
ఆడపడుచులకు బతుకమ్మ కానుక
ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ..
● ఎస్‌హెచ్‌జీల సభ్యులకు రెండేసి చీరలు ● జిల్లాకు 3.35 లక్షలు చీరల కేటాయింపు ● విడతల వారీగా వస్తున్న స్టాక్
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు కానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు ప్రభుత్వం తరఫున చీరలు పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యాన సిద్ధమైన చీరలను విడతల వారీగా జిల్లాకు చేరవేస్తున్నారు. బతుకమ్మ వేడుకల ప్రారంభానికి ముందే వీటిని అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటి ఒకటి.. తర్వాత ఇంకొకటి
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం 3,35,878 చీరలు కేటాయించారు. సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాల సభ్యులకు రెండేసి చీరలు పంపిణీ చేస్తారు. బతుకమ్మ పండుగ ప్రారంభానికి ముందు ఒకటి.. వేడుకలు మొదలయ్యాక ఇంకొకటి అందించనున్నట్లు సమాచారం. తొలిదఫా ఇవ్వాల్సిన సుమారు 1.50 లక్షల చీరలు ఇప్పటికే చేరగా, మిగిలినవీ వారం రోజుల్లో వచ్చే అవకాశముంది. జిల్లాలో 20 మండల సమాఖ్యలు, 1,018 గ్రామ సమాఖ్యలు, 26వేల స్వయం సహాయక సంఘాల్లో 2లక్షలకు మందికి పైగా సభ్యులు ఉన్నారు.
స్టాక్ పాయింట్లలో నిల్వ
జిల్లాకు చేరుకున్న చీరలను అధికారులు స్టాక్ పాయింట్లలో భద్రపరుస్తున్నారు. రఘునాథపాలెం(టేకులపల్లి జిల్లా మహిళా సమాఖ్య ప్రాంగణం), వైరా, మధిర మార్కెట్ల గోదాంలు, సత్తుపల్లి మండల సమాఖ్య కార్యాలయంలో డంప్ చేస్తున్నారు. అలాగే, మెప్మా పరిధిలోని సంఘాల సభ్యుల చీరలను ఆ విభాగం అధికారులకు అప్పగిస్తారు. బతుకమ్మ పండుగను మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా జరుపుకునేలా వేడుకలు ప్రారంభమయ్యేలోగానే చీరల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చీరలను ప్రత్యేక సంచిలో ప్యాక్ చేసి ఇవ్వనున్నారు. ఆ సంచిపై ఇందిరాగాంధీ ఫొటో, ఇందిరా మహిళా శక్తి పేరిట లోగోతో పాటు ‘అక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ అని రాసి ఉంది. అలాగే, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రుల ఫొటోలు ముద్రించారు.
యూనిఫామ్ శారీస్ కింద జిల్లాకు ప్రభుత్వం చీరలు సరఫరా చేస్తుంది. ప్రత్యేక సంచిలో ప్యాక్ చేసి వీటిని మహిళా సంఘాల సభ్యులకు అందజేయనున్నాం. ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు, విధివిధానాలు రాగానే పంపిణీపై స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు జిల్లాకు చేరిన చీరలను గోదాముల్లో భద్రపరుస్తున్నాం.
– సన్యాసయ్య, డీఆర్‌డీఓ

ఆడపడుచులకు బతుకమ్మ కానుక

ఆడపడుచులకు బతుకమ్మ కానుక