
రక్షణ.. ఇంకొంత దూరం
రిటైనింగ్ వాల్ పొడిగింపునకు కసరత్తు
అదనంగా రూ.600 కోట్లతో నిర్మాణం
సర్వే అనంతరం స్పష్టత
ఖమ్మంఅర్బన్: మున్నేటికి ఏటా వస్తున్న వరదతో ఖమ్మం నగరం వైపు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో నష్టం ఎదురుకావడంతో ఇప్పటికే రూ.690 కోట్ల అంచనాలతో మున్నేటికి ఇరువైపులా 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. అయితే, ముంపు సమస్యను మరింత తగ్గించేలా గోడను ధంసలాపురం వరకు ఇరువైపులా మరో 12 కి.మీ. మేర నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించగా.. నిర్మాణం, భూసేకరణకు రూ.600 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
పొడిగింపుతో మరింత భరోసా
ప్రస్తుతం మున్నేటికి ఇరువైపులా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతోంది. ఖమ్మం నగరంలో దానవాయిగూడెం నుంచి ప్రకాష్‌నగర్ వంతెన వరకు నిర్మిస్తుండగా, అక్కడి నుంచి ధంసలాపురం వద్ద నేషనల్ హైవే వంతెన వరకు పొడిగించాలని నిర్ణయించారు. తద్వారా శ్రీనివాస్‌నగర్, ధంసలాపురం, అగ్రహారం కాలనీ ప్రాంతాలకు సైతం ముంపు నుంచి రక్షణ లభిస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో మున్నేటికి వచ్చిన భారీ వరదతో ధంసలాపురం, అగ్రహారం ప్రాంతాల్లో సుమారు 1,300 పైగా ఇళ్లు నీట మునగగా పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యాన రిటైనింగ్ వాల్‌ను పొడిగించడం ద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్నారు.
రిటైనింగ్ వాల్ పొడిగింపునకు మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో మా శాఖ ఉద్యోగులు సర్వే చేశాక అంచనాలతో నివేదిక రూపొందిస్తాం. తద్వారా ఎంత మేర భూమి అవసరం, నిధులు ఎంత కేటాయించాలో స్పష్టత వస్తుంది.
– మంగళపుడి వెంకటేశ్వర్లు, జలవనరులశాఖ ఎస్‌ఈ

రక్షణ.. ఇంకొంత దూరం