
ఆరు మండలాల్లో పంట నష్టం గుర్తింపు
ఖమ్మంవ్యవసాయం: ఇటీవల భారీ వర్షాలతో జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ చేపట్టిన సర్వే కొనసాగుతోంది. గతనెల మూడు, నాలుగో వారాల్లో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, నదులు, జలాశయాల పరీవాహకం, పల్లపు ప్రాంతాల్లో పంటలు వరద ముంపునకు గురయ్యాయి. ఈమేరకు పంట నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఏఈఓలతో సర్వే చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు మండలాల్లో సర్వే పూర్తి కాగా, మరో మూడు మండలాల్లో కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాగా, ఆరు మండలాల్లో 595 మంది రైతులకు చెందిన 775.37 ఎకరాల్లో పత్తి, వరి, పెసర పంటలకు నష్టం జరిగిందని ఏఓఓలు నివేదిక అందజేశారు. రఘునాథపాలెం మండలంలో 18, కూసుమంచి మండలంలో 197, కల్లూరులో 77.12, తల్లాడ మండలంలో 34, ఏన్కూరు మండలంలో 30.25, కారేపల్లి మండలంలో 108 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ఇక కొణిజర్ల, వైరా, చింతకాని మండలాల్లో సర్వే చివరి దశలో ఉంది. ఈ మండలాల్లో 2,500 ఎకరాలకు పైగా పెసర, వరి, పత్తి పంటలకు నష్టం జరిగినట్లు సమాచారం. మొత్తంగా జిల్లాలో పంట నష్టం వివరాలను ఒకటి, రెండు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది.
మిగతా చోట్ల కొనసాగుతున్న ప్రక్రియ