
పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి
ఖమ్మం సహకారనగర్: కొత్త పెన్షన్ విధానం(సీపీఎస్)ను తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం(ఎస్‌జీపీఏటీ) రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు జి.వీరస్వామి డిమాండ్ చేశారు. సంఘం జిల్లా స్థాయి సమావేశం మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వీరస్వామి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం బకాయిలు 15నెలలు గడిచినా రాకపోవడంతో పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇకనైనా బకా యిలు వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థలు, మార్కెట్ కమిటీల్లో రిటైర్డ్ ఉద్యోగులకు సైతం ట్రెజరీల ద్వారా పెన్షన్ చెల్లించాలని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించి హైదరాబాద్‌లో పెన్షనర్ల భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వి.రాంమనోహర్, తుమ్మా వీరయ్య, కె.సుధీర్‌బాబు, రాయల రవికుమార్, కనపర్తి వెంకటేశ్వర్లు, మేరీ ఏసుపాదం, తాడి అంజలి, పెదమళ్ల సత్యనారాయణ, కొలికొండ శరత్‌బాబు, ఊడుగు వెంకటేశ్వర్లు, వీరభద్రరావు, లక్ష్మి, సుజాత, అన్నమ్మ, ప్రసాదరావు, గుర్రాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, వ్యవసాయ మార్కెట్లలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మూడు నెలలుగా పెన్షన్ అందడం లేదని జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం
నాయకుడు వీరస్వామి