
‘పడిపోతున్న కార్మికుల జీవన ప్రమాణాలు’
ఖమ్మంమయూరిసెంటర్: ప్రధానిగా మోడీ ఇంకొన్నాళ్లు కొనసాగితే కార్మికుల కనీస జీవన ప్రమాణాలు మరింత పడిపోతాయని తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్ల (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్) యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన జిల్లా నాలుగో మహాసభలో ఆయన మా ట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం కార్పొరేట్లకు అప్పగిస్తోందని ఆరోపించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పది గంటల పనివిధానం తీసుకురావడం గర్హనీయమని పేర్కొన్నారు. కీలకమైన రవాణా రంగంపై పాలకులు చిన్నచూపు విడనాడకపోతే సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కాగా, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటోడ్రైవర్లకు నెలకు రూ.12 వేలు, డ్రైవర్లకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.అనంతరం సంఘం నూతన అధ్యక్షుడిగా వై విక్రమ్, కార్యదర్శిగా జిల్లా ఉపేందర్, కోశాధికారిగా ధరావత్ రాందాస్‌తోపాటు 31 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.విష్ణు, నాయకులు పి.మోహన్‌రావు, బాబు తదితరులు పాల్గొన్నారు.