
ఇక ఇసుక బజార్లు !
● ఇందిరమ్మ లబ్ధిదారులకు పంపిణీ కోసం ఏర్పాటు ● ఒక్కో ఇంటికి 10 ట్రాక్టర్ల ఇసుక ఇచ్చేలా నిర్ణయం ● టన్ను రూ.1,100 ధరతో విక్రయం
ఖమ్మంగాంధీచౌక్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఇసుక బజార్లు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇసుక ధరలు ఎక్కువగా ఉండడమే కాక వర్షాకాలం కావటంతో పలు ప్రాంతాల్లో సరిపడా లభించడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సమస్య ఎదురై ఆలస్యమవుతోంది. కొన్నిచోట్ల ధరల కారణంగా లబ్ధిదారులు నిర్మాణాలు నిలిపివేశారు. ఈ నేపథ్యాన ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇసుక బజార్ ఏర్పాటుచేయనున్నారు.
తొలి బజార్ కూసుమంచిలో...
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను టన్ను రూ.1,100 చొప్పున లబ్ధిదారులకు ఇసుక బజార్ల ద్వారా అందిస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 10 టాక్టర్లు(40 టన్నులు) ఇసుక అందించేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు తొలి ఇసుక బజార్‌ను కూసుమంచిలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కాగా, లబ్ధిదారులు గృహ నిర్మాణ శాఖ ఏఈ నుంచి ఇండెంట్ పొంది తహసీల్దార్‌కు అందిస్తే వారు కూపన్ల జారీ చేస్తారు. ఈ కూపన్ల ఆధారంగా ఇసుకను తీసుకోవచ్చు. లబ్ధిదారులే ట్రాక్టర్ తెచ్చుకోవాల్సి ఉండగా.. నిర్వాహకులు కాంటా పెట్టి అప్పగిస్తారు. కాగా, నగదు ఆన్‌లైన్‌లో చెల్లించేలా ఏర్కాపట్లు చేశారు.
నియోజకవర్గాల వారీగా ఏర్పాటు
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇసుక బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జిల్లాలో ఇప్పటికే పాలేరు నియోజకవర్గ బజార్‌ను కూసుమంచిలో ఏర్పాటుచేశారు. ఇక ఖమ్మం నియోజకవర్గానికి ఎన్‌ఎస్‌పీ క్యాంపులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలతో పాటు ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కామేపల్లి మండలంలో కూడా ఇసుక బజార్ ఏర్పాటుకు నిర్ణయించారు. వీటిలో గోదావరి ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తారు. కాగా, మహిళా సంఘాల సభ్యులు ఇళ్లు నిర్మించుకుంటే టన్ను రూ.1,300 చొప్పున ఇసుక కొనుగోలుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.