
ప్రభుత్వ ఆఫీసులకు సౌరవెలుగులు
● భవనాలపై సోలార్ పలకల ఏర్పాటు ● జిల్లాలో 4,700 భవనాల ఎంపిక ● మిగులు విద్యుత్ డిస్కంలకు విక్రయం
నేలకొండపల్లి: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో త్వరలోనే సౌర వెలుగులు నిండనున్నాయి. విద్యుత్ అవసరాలు పెరుగుతుండడంతో బిల్లులు భారం తగ్గించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పల్లె నుంచి పట్నం వరకు గ్రామపంచాయతీ మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సౌర పలకలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో సౌర ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన భవనాలు కలిగిన కార్యాలయాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు.
విద్యుత్ బిల్లులు ఆదా...
ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులు రూ.వేలల్లో ఉంటున్నాయి. కొన్ని కార్యాలయాల బిల్లులు చెల్లించకపోవడంతో పేరుకుపోతున్నాయి. ఈనేపథ్యాన ప్రభుత్వ భవనాలపై సౌర ప్లాంట్ల ఏర్పాటుతో కార్యాలయాల అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఎక్కడైనా మిగిలితే డిస్కంలకు విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కార్యాలయాలతోపాటు ఇతర కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థల భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. కాగా, ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో సౌర పలకలు ఉన్నా నిర్వహణ లోపంతో పనిచేయడం లేదని గుర్తించిన అధి కారులు మరమ్మతులకు ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు.
4,700 విద్యుత్ కనెక్షన్లు
జిల్లాలో వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలకు ప్రస్తుతం 4,700కు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయా భవనాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో దాదాపు 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశముందని అంచనా వేశారు. దీంతో త్వరగా ప్లాంట్లు ఏర్పాటుచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా తీర్చిదిద్దేలా పనులు జరుగుతున్నాయి.