
ఉద్యోగులదే విజయం!
ప్రాజెక్టు ఇలా
‘రాజీవ్ స్వగృహ’ దక్కడంపై హర్షం
576 ఫ్లాట్లకు రూ.87.41కోట్లతో బిడ్
ఖరారు కావడంతో
ఉద్యోగుల సంబురాలు
ఖమ్మం సహకారనగర్: ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు, బిల్డర్ల నుంచి పోటీని తట్టుకుని రాజీవ్ స్వగృహ సముదాయాన్ని ఉద్యోగులు దక్కించుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో రాజీవ్ స్వగృహ పేరిట అపార్ల్‌మెంట్లు ఏళ్ల క్రితం నిర్మించగా అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ బ్లాక్‌లను ఉన్నవి ఉన్నట్లు విక్రయించేందుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించగా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన కొనుగోలుకు సిద్ధమయ్యారు. తద్వారా సొంతింటి కల వేరుతుందని భావించారు. ఇందుకోసం రూ.87.41కోట్లతో బిడ్ దాఖలు చేయగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహకార గృహ నిర్మాణ సంఘానికి కేటాయించినట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ.గౌతమ్ సోమవారం ప్రకటించారు. సుమారు 9.22 ఎకరాల్లో 576 ఫ్లాట్లు ఉండగా, చదరపు అడుగుకు రూ.1,150 చొప్పున ధరతో బిడ్ దాఖలు చేశారు. తొలుత ఈనెల 6వ తేదీన ఉద్యోగ సంఘాల తరఫున రూ.5కోట్ల ధరావతు చెల్లించారు. అదేరోజు ఓ కాంట్రాక్టర్ కూడా దరఖాస్తు చేయడంతో మీమాంస నెలకొంది. కానీ సదరు కాంట్రాక్టర్ వెనక్కి తగ్గడంతో ఉద్యోగ సంఘాలకే దక్కినట్లయింది. ఈమేరకు సోమవారం రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ సీఈ భాస్కర్‌రెడ్డి, ఈఈ నరేందర్‌రెడ్డి ధ్రువపత్రాన్ని ఉద్యోగ సంఘాల సొసైటీ బాధ్యులకు అందజేశారు. వచ్చే నెల 7వ తేదీలోగా రూ.17 కోట్లు చెల్లించాల్సి ఉండగా... మిగతా మొత్తాన్ని విడతల వారీ చెల్లించేలా నిబంధనల్లో పొందుపరిచారు.
ఆందోళన నుంచి ఆనందం
ఫ్లాట్లు అసంపూర్తిగా ఉండడంతో బిడ్‌లో గెలుచుకుని పూర్తిచేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఇందుకోసం నిర్ణీత ధరతో ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా 250మందికి పైగా ముందుకొచ్చారు. ఈమేరకు ప్రైవేట్ అపార్ట్‌మెంట్లను పోలినట్లు బ్రోచర్లు ముద్రించగా కొత్త రూపులో ఉండడం.. మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ముంపు సమస్య ఉండదని భావించిన బిల్డర్లు కూడా ఇటుకన్నేశారు. దీంతో రాజీవ్ స్వగృహ సముదాయం దక్కుతుందా, లేదా అని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్రస్థాయిలో ఉద్యోగ సంఘాల నాయకులు బిడ్ వేసిన కాంట్రాక్టర్‌తో చర్చించగా ఆయన ఉపసంహరించుకోవడంతో సముదాయం ఉద్యోగుల వశమైనట్లయింది. దీంతో సోమవారం స్వగృహ వద్ద బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీవ్ స్వగృహ విషయంలో సహకరించిన వ్యాపారవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహకారంతోనే రాజీవ్ స్వగృహ దక్కించుకున్నామని.. తద్వారా ఉద్యోగుల సొంతింటి కల నెరవేరుతోందని చెప్పారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు మధ్య తరగతి ఉద్యోగుల సొంత ఇంటి కలలను నెరవేరుస్తుందని తెలిపారు. హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా కిషోర్, ఈట విజయ్‌కుమార్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్, టీజీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, వేలాద్రితో పాటు వెంకన్న, జైపాల్, గంగవరపు బాలకృష్ణ, మల్లెల రవీంద్రప్రసాద్, ప్రభాకరాచారి, లలిత కుమారి, మృదుల, ఆంజనేయులు, సుధాకర్, రుక్మారావు తదితరులు పాల్గొన్నారు.
పోలెపల్లిలోని 9.22 ఎకరాల్లో ఎనిమిది టవర్లుగా ఈ సముదాయం నిర్మాణాన్ని చేపట్టారు. ఇక్కడ ఎనిమిది బ్లాక్‌ల్లో తొమ్మిది అంతస్తులుగా 576 ఫ్లాట్లు నిర్మించారు. చదరపు అడుగుకు ప్రభుత్వానికి రూ.1,150 చెల్లించాల్సి ఉండగా, రూ.2,500 చొప్పున తీసుకుని నిర్మాణం పూర్తిచేసి కేటాయిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గెజిటెడ్, నాన్–గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వీటిని కేటాయించాలని ప్రతిపాదించారు. అంతేకాక ఈ సముదాయంలో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించేలా డిజైన్లు సిద్ధం చేశారు.