
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మంగళవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎర్రుపాలెం, పెద్దగోపవరం, బుచ్చిరెడ్డిపాలెం, బనిగండ్లపాడు, అయ్యవారిగూడెంలో నిర్మించే రహదారులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, బీమవరంలో రూ.12లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 10–30 గంటలకు కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి, ఆతర్వాత నరసింహులగూడెం, కిష్టాపురం గ్రామంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో గీతకార్మికులకు కాటమయ్య కిట్లు, కూసుమంచి మండల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, పాలేరు నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీలకు కుట్టుమిషన్లు పంపిణీ చేస్తారు. అలాగే, సాయంత్రం జుజ్జులరావుపేట, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పెద్దతండాలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక ఖమ్మంరూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందచేయనున్నారు. అనంతరం మంత్రి తెల్దారుపల్లిలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
ఎన్నికల నిర్వహణకు సహకరించండి
ఖమ్మం సహకారనగర్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని జెడ్పీ సీఈఓ దీక్షారైనా సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆమె వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాపై చర్చించి అభ్యంతరాలను స్వీకరించాక సీఈఓ మాట్లాడారు. అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాక తుదిజాబితా విడుదల చేస్తామని తెలిపారు.
చేపి పిల్లల టెండర్ల గడువు మళ్లీ పొడిగింపు
ఖమ్మంవ్యవసాయం: చేపపిల్లల పంపిణీకి ఆశించిన స్థాయిలో టెండర్లు రాకపోవడంతో దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోమారు పొడిగించింది. మత్స్యశాఖ ఆధ్వర్యాన ఆగస్టు 8న నోటిఫికేషన్ జారీ చేసి తొలుత సెప్టెంబర్ 1 వరకు గడువు విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 25 టెండర్లే రావడంతో ఈనెల 8వరకు గడువు విధించారు. అయినా ఫలితం లేక 12వ తేదీ వరకు గడువు పొడిగించారు. జిల్లాలో 3.49 కోట్ల చేప పిల్లల పంపిణీకి తొలుత ముగ్గురు, రెండో విడతలో ఇంకో కాంట్రాక్టరు టెండర్లు దాఖలు చేశారని జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు.
జాతీయ స్థాయి
పోటీల్లో ప్రతిభ
ఖమ్మంరూరల్: మండలంలోని పోలేపల్లి కేంద్రియ విద్యాలయం విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో సత్తా చాటారు. పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్ రీజియన్లలో నిర్వహించిన పోటీల్లో 48మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రెండేసి బంగారు, రజత పతకాలతో పాటు నాలుగు కాంస్య పతకాలు, రూ.44వేల నగదు బహుమతులు సాధించారని ప్రిన్సిపాల్ కవీంద్రరాయ్ తెలిపారు.
బోధన ఎలా
సాగుతోంది?
బోనకల్: మండలంలోని రావినూతల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను సోమవారం గురుకులాల ఆర్‌సీఓ రాంబాబు తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన బోధన, మెనూ అమలుపై ఆరా తీశారు. ఆతర్వాత పాఠశాలలో మౌలిక వసతులు, డైనింగ్ హాల్, సామగ్రిని పరిశీలించి సూచనలు చేశారు. అయితే, తరగతి గదుల కొరత ఉండడమేకాక డైనింగ్ హాల్ సరిపోక ఆరుబయటే భోజనాలు చేయాల్సి వస్తోందని ఆయనకు వివరించారు. దీంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆర్‌సీఓ తెలిపారు.