
డెడ్‌లైన్ పెట్టుకుంటేనే వేగం
● వచ్చే జూన్‌లోగా రిటైనింగ్ వాల్ పూర్తి ● కేబుల్ బ్రిడ్జి పనులపై ప్రత్యేక దృష్టి ● అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రతీ అభివృద్ధి పని పూర్తికి లక్ష్యం నిర్దేశించుకుని వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డితో కలసి మున్నేరు రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి, ఖిలా రోప్‌వే పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మున్నేటి ముంపు నుంచి రక్షించేలా రూ.690 కోట్లతో ఇరువైపులా 17 కి.మీ. మేర నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఇప్పటికే 6.4 కి.మీ. పూర్తయిందని తెలిపారు. ఇంకా అవసరమైన భూసేకరణ చేపట్టి వచ్చే జూన్‌లోపే నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు.
చకచకా కేబుల్ బ్రిడ్జి
కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. రూ.180 కోట్లతో చేపడుతున్న నిర్మాణం 53 శాతం పూర్తయిందని, వచ్చే మే నెలాఖరుకు అందుబాటులోకి రావాలని సూచించారు. అలాగే, ఖమ్మం ఖిలాపైకి రోప్ వే కోసం భూసేకరణ పూర్తికాగా, రూ.29 కోట్లతో చేపట్టే పనులు ప్రారంభించి వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలన్నారు.
ట్రాఫిక్ సమస్యకు చెక్
ఖమ్మం నగరం చుట్టూ హైవేల నిర్మాణంతో ట్రాఫిక్ ఇక్కట్లు తీరతాయని మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారిపై ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, మున్నేటిపై బ్రిడ్జి పనులు జరుగుతున్నాయన్నారు. జనవరిలోగా అందుబాటులోకి వచ్చే ఈ హైవే పైనుంచే కోల్‌కతా, ఒడిశా, ఏపీలోని సగభాగం ప్రాంతాలకు ఖమ్మం మీదుగానే రాకపోకలు ఉంటాయన్నారు. అంతేకాక ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య ఉండదని చెప్పారు. ఆ తర్వాత అభివృద్ధి పనుల ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి పరిశీలించారు. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు ఎం.వెంకటేశ్వర్లు, యాకోబ్, ఆర్డీఓ నర్సింహారావు, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తితో పాటు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.