
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు
గ్రీవెన్స్ డేలో అదనపు కలెక్టర్
శ్రీనివాసరెడ్డి
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఏ ఫిర్యాదును కూడా పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా అమలు చేయాలి
ఖమ్మంవైద్యవిభాగం: స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఏర్పాటైన జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీతో కలెక్టరేట్‌లో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17నుంచి అక్టోబర్ 2వరకు స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా మహిళలకు పరిశుభ్రత, పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యాసంస్థల్లోనూ క్యాంపులు నిర్వహించిన అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేయాలన్నారు. డీఆర్‌ఓఏ పద్మశ్రీ, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి తదితరులు పాల్గొన్నారు.