
పర్యాటక ప్రాంతంగా ‘నీలాద్రి’ అభివృద్ధి
సత్తుపల్లిటౌన్: మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బెక్కా కొండల తరహాలో నీలాద్రి కొండలపై ప్రాచీన కాలం నాటి గుర్తులు ఉన్నందున పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అటవీ, దేవాదాయ శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని సీసీఎఫ్ డాక్టర్ డి.భీమానాయక్ వెల్లడించారు. ఖమ్మం డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌తో కలిసి నీలాద్రి కొండపై సుమారు 5 కి.మీ. ట్రెక్కింగ్ చేశాక సత్తుపల్లి మండలం కిష్టారం సెక్షన్, చెరుకుపల్లి బీట్ నర్సరీలను పరిశీలించారు. మొక్కల సంరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం చంద్రాయపాలెం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అంతేకాక వీఎస్‌ఎస్ సభ్యులతోనూ సమావేశమైన సీపీఎఫ్ మాట్లాడారు. నీలాద్రి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యాన పరిశోధన జరిపించనున్నట్లు చెప్పారు. వన సంరక్షణ సమితి సభ్యులకు అండగా నిలుస్తూ జీవనోపాధికి అవసరమైన ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. ఇదేసమయాన సభ్యులు అటవీ వనరులు, జీవవైవిధ్యం పరిరక్షణకు పాటపడాలని సూచించారు. కాగా, సత్తుపల్లి అర్బన్ పార్క్‌లో రూ.20లక్షలతో చేపడుతున్న యోగా షెడ్ నిర్మాణ పనులను డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ పరిశీలించారు. సత్తుపల్లి ఎఫ్‌డీఓ వాడపల్లి మంజుల, రేంజర్ స్నేహలతతో పాటు డీఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు పాల్గొన్నారు.
సీసీఎఫ్ భీమానాయక్