
సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ
ఖమ్మంవ్యవసాయం: ‘సాగు యంత్రాలు అందించండి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. యంత్ర పరికరాలకు నిధులు మంజూరైనా పథకం అమలులో కాలయాపనతో రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని కథనంలో వెల్లడించగా అధికారులు రంగంలోకి దిగారు. యంత్ర పరికరాల పంపిణీ కోసం కలెక్టర్ అనుమతి తీసుకున్నారు. సన్న, చిన్నకారు ఎస్సీ, ఎస్టీ, ఇతర రైతులకు 50 శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీపై యంత్రాలు అందించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు.
ఇవీ మార్గదర్శకాలు
స్ప్రేయర్లు, రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టే తదితర యంత్రాలు అందించనుండగా, జిల్లాకు రూ.4,37,97,000 నిధులను ప్రభుత్వం కేటాయించిందని డీఏఓ పేర్కొన్నారు. కలెక్టర్ అనుమతితో నియోజకవర్గాల వారీగా కేటాయించిన బడ్జెట్ ఆధారంగా పనిముట్ల పంపిణీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుండగా, రైతులు ఏఈఓలు, ఏఓలను సంప్రదించాలని సూచించారు. పథకం అమలుకు మండల స్థాయిలో ఏర్పాటుచేసిన కమిటీకి కన్వీనర్‌గా మండల వ్యవసాయాధికారి, సభ్యులుగా తహసీల్దార్, ఎంపీడీఓ వ్యవహరిస్తారని తెలిపారు. ఇక జిల్లా కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా జిల్లా వ్యవసాయాధికారి, సభ్యులుగా ఆగ్రోస్ రీజినల్ మేనేజర్, డాట్ సైంటిస్ట్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉంటారని చెప్పారు. బ్యాటరీ చేతిపంపులపై రూ.వేయి, పవర్ స్ప్రేయర్లకు రూ.10వేలు, రోటోవేటర్‌కు రూ.50వేలు, విత్తన, ఎరువులు వేసే యంత్రానికి రూ.30వేలు, కల్టివేటర్లు, ఎంబీ ప్లౌ, దమ్ము చక్రాలు, డిస్క్ హరోలకు రూ.30వేలు, బండ్ ఫార్మర్‌కు రూ.1.50లక్షలు, పవర్ వీడర్, బ్రష్ కట్టర్లకు రూ.35వేలు, పవర్ టిల్లర్‌కు రూ.లక్ష, మొక్కజొన్న కోత యంత్రాలు, గడ్డికట్టే యంత్రాలకురూ.రూ.లక్ష సబ్సిడీ ఉంటుందని డీఏఓ పుల్లయ్య ఓ ప్రకటనలో తెలిపారు.