
పత్తి దిగుమతిపై సుంకం రద్దు సరికాదు..
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై 11 శాతం సుంకాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని వామపక్ష రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మలీదు నాగేశ్వరరావు, కొల్లేటి నాగేశ్వరరావు, దొండపాటి రమేష్, మాదినేని రమేష్ మాట్లాడారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈనెల 10న ఖమ్మంలో రైతాంగ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసదస్సులో రైతులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కాగా, రైతాంగానికి సరిపడా యూరియాను కేంద్రం సరఫరా చేయాలని, రాష్ట్రంలో నష్టపోయిన పంటలపై సర్వే చేయించాలని డిమాండ్ చేశారు.