యంత్ర పథకం అమలులో
కాలయాపన
సాగు కాలం గడుస్తున్నా అన్నదాత
చెంతకు చేరని పరికరాలు
జిల్లాకు రూ.4.37 కోట్ల
నిధులు మంజూరు
దరఖాస్తు చేసుకునేందుకు
సిద్ధంగా ఉన్న రైతులు
త్వరలోనే అమలు..
ఖమ్మంవ్యవసాయం: పంటల సాగులో రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించిన యాంత్రీకరణ పథకం అమలులో కాలయాపన జరుగుతోంది. ఆధునిక యంత్రాలతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా యాంత్రీకరణ పథకం రూపుదిద్దుకుంది. పంటల సాగులో వినియోగించే యంత్ర పరికరాలను రైతులకు రాయితీలపై అందించటం ఈ పథకం ఉద్దేశం. ఇది అనాదిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో 2016 – 17 ఆర్థిక సంవత్సరం నుంచి అమలుకు నోచుకోవటం లేదు. మారుతున్న కాలం, ఆధునిక సాంకేతిక విధానాలు అమలులోకి రావటంతో రైతులకు యంత్ర పరికరాల వినియోగంపై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ యంత్రాలు అందకపోవటం వారిని నిరాశకు గురిచేస్తోంది.
నిధులు మంజూరైనా నిష్ప్రయోజనం
తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా యాంత్రీకరణ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. 9 ఏళ్లుగా అమలుకు నోచుకోని ఈ పథకాన్ని 2025–26లో అమ లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వానాకాలానికి ముందు నుంచే సన్నాహాలు చేసింది. అయితే బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉండటం, పరికరాల ధర అధికంగా ఉండటంతో కొందిరికే లాభం చేకూరనుండటంతో పథకం అమలులో మార్పులు తీసుకువచ్చారు. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా యంత్ర పరికరాలను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయాలనుకోవడంతో జాప్యం అనివార్యమైంది. ఈ పథకం కింద జిల్లాకు రూ. 4,37,97,000లు మంజూరు చేసింది.
పరిమిత పరికరాలకు అనుమతి
గతంలో యాంత్రీకరణ పథకంలో ఖరీదైన ట్రా క్టర్లు, పంటకోత మిషన్లు, డ్రోన్లతోపాటు నాగళ్లు, పవర్ స్ప్రేయర్లు వంటివి ఇచ్చేవారు. ఈ ఏడాది నిర్దేశించిన పనిముట్లు మాత్రమే ఇవ్వాలని, రూ. 1,000 నుంచి రూ.1.50 లక్షల వరకు సబ్సిడీపై అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. బ్యా టరీ స్ప్రేయర్లు రూ.1,000, పవర్ స్ప్రేయర్లు రూ. 10 వేలు, రొటోవేటర్లు రూ.50వేలు, సీడ్‌కం ఫర్టిలైజర్ డ్రిల్స్ రూ.30వేలు, కేజ్‌వీల్స్, డిస్క్‌లకు రూ.20 వేలు, పవర్ వీడర్లకు రూ.75వేలు, బండ్ ఫార్మింగ్ యంత్రాలు రూ.1.50లక్షలు, బ్రష్‌కట్టర్లు రూ.35 వేలు, పవర్ టిల్లర్లకు రూ.లక్ష, మ్కొజొన్న వలిచే యంత్రాలు, వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాలకు రూ.లక్ష చొప్పున రాయితీ కల్పించాలనుకున్నారు. రూ.లక్ష సబ్సిడీ అందించే పరికరాల మంజూరును సహాయ వ్యవసాయ సంచాలకులు చేయనుండగా.. ఆపై సబ్సిడీతో కూడిన పరికరాల మంజూరు అధికారం కలెక్టర్‌కు కేటాయించారు.
సర్వం సిద్ధం.. అయినా జాప్యం
యంత్రీకరణ పథకానికి సంబంధించిన ఫైల్‌ను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడే కాలయాపన జరుగుతోంది. ఈ దశ దాటితే పథకం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. జిల్లాలోని వ్యవసాయ డివిజన్ల వారీగా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, పరికరాల మంజూరు, వంటి అంశాలు అమలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం యాంత్రీకరణ పరికరాల పథకాన్ని ప్రకటిస్తే రైతులు వారికి అవసరమైన వ్యవసాయ పరికరాలు, యంత్రాలకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
యాంత్రీకరణ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పథకంలో రైతులకు అందించే పరికరాలను గుర్తించాం. ఆయా పరికరాలకు నిర్దేశించిన విధంగా రాయితీలను అందిస్తాం. ఉన్నతాధికారుల అనుమతులతో పథకం అమలుకు చర్యలు తీసుకుంటాం.
–ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి
సాగు యంత్రాలు అందించండి..