
నేటి నుంచి సాగునీటి నిలిపివేత
కల్లూరురూరల్: మధిర బ్రాంచ్ సాగర్ కెనాల్‌కు ఆదివారం నుంచి 12వ తేదీ వరకు సాగునీరు నిలిపివేయనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. వారబందీ విధానం అమలు చేస్తున్నందున ఆరు రోజుల పాటు నీటి విడుదల ఉండదని పేర్కొన్నారు. తిరిగి 13 నుంచి 18వ తేదీ వరకు నీరు సరఫరా చేస్తామని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు.
విద్యుదాఘాతంతో
మేకల కాపరి మృతి
తిరుమలాయపాలెం: మేకలు మేపేందుకు వెళ్లి చెట్టుకొమ్మలు కొడుతున్న క్రమాన విద్యుదాఘాతానికి గురైన కాపరి మృతి చెందాడు. మండలంలోని ఇస్లావత్‌తండాకు చెందిన ఇస్లావత్ సక్లాల్ (26) వ్యవసాయంతో పాటు మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం మేకలతో అడవికి వెళ్లిన ఆయన చెట్ల కొమ్మలు కొట్టి వేస్తుండగా, ఆపైన ఉన్న విద్యుత్ లైన్ తాకడంతో షాక్‌కు గురై పక్కనే బావిలో పడ్డాడు. కొద్దిసేపటికి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని బయటకు తీయించారు. సక్లాల్‌కు భార్య సరిత ఉంది. ఆయన తండ్రి నాగులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి
మృతదేహం లభ్యం
ముదిగొండ: వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి మండలంలోని మాధాపురం చెరువులో శుక్రవారం గల్లంతైన పడిశాల సైదారావు (24) మృతదేహాన్ని శనివా రం గుర్తించారు. స్థానికులు శుక్రవారం రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. శనివా రం ఉదయం ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలించగా మృతదేహం లభ్యమైంది. ఘటనపై ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డీజే సౌండ్‌కు
కుప్పకూలిన మహిళ
నేలకొండపల్లి: వినాయక నిమజ్జనంలో ఏర్పా టు చేసిన డీజే శబ్దంతో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. మండలంలోని మంగాపురంతండా లో శనివారం రాత్రి గణేశ్ శోభాయాత్ర జరుగుతుండగా డీజే పాటలకు అనుగుణంగా భూక్యా పార్వతి నృత్యం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కుప్పకూలగా స్థానికంగా చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. అలాగే, మండల కేంద్రంలో వినాయక శోభాయాత్రలో భాగంగా బాణసంచా కాల్చేక్రమాన ప్రమాదంజరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.