
కడదాకా సిద్ధాంతాన్ని వీడని రమేశ్
ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనిస్టు ఉద్యమం, సిద్ధాంతాలు బలహీనపడిన పరిస్థితుల్లో ఉద్యమాన్ని అంటిపెట్టుకుని కడవరకు నిలిచిన నర్రా రమేశ్ చిరస్మరణీయుడని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. అయితే, కమ్యూనిస్టు ఉద్యమం చిగురిస్తున్న సమయంలో ఆయన మృతి బాధాకరమన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో శనివారం మృతి చెందిన మాజీ కౌన్సిలర్, సీపీఎం నాయకుడు నర్రా రమేశ్ (58) సంతాప సభ పార్టీ జిల్లా కార్యాయలంలో నిర్వహించారు. ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించాక తమ్మినేని మాట్లాడుతూ.. కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేకి అయిన ప్రధాని మోదీ ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా ప్రధాని పుతిన్ కలిసి ఫ్రంట్ ఏర్పాటుకు సిద్ధమవడమే కమ్యూనిస్టు ఉద్యమానికి మంచిరోజులు వచ్చాయనేందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రమేశ్ మృతి బాధాకరమని, విద్యార్థి, యువజన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. కాగా, నర్రా రమేశ్‌కు భార్య నాగలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉండగా నాగలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నారు. సంతాప సభలో కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, బి.వెంకట్‌కుమార్, నాయకులు వై.విక్రమ్, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, ఏజే రమేశ్, అన్నవరపు సత్యనారాయణ, పి.రాజారావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, నాగరాజు, సీపీఐ, మాస్‌లైన్, బీఆర్‌ఎస్ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు శింగు నర్సింహారావు, మువ్వా శ్రీనివాసరావు, సీవై.పుల్లయ్య, ఆవుల అశోక్, డాక్టర్ చీకటి భారవి, పగడాల నాగరాజు, శీలంశెట్టి రమావీరభద్రం, మెంతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ కౌన్సిలర్ సంతాప సభలో తమ్మినేని వీరభద్రం