
నేడు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఖమ్మం నగరంతో పాటు రఘునాథపాలెం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మంలోని ధంసలాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్–ఎంట్రీ పనులు, ఆర్‌ఓబీ నిర్మాణ పనులను మంత్రి పరిశీలిస్తారు. అలాగే, మధ్యాహ్నం గాంధీచౌక్‌లో గణేశ్ విగ్రహాల శోభాయాత్రను ప్రారంభి స్తారు. ఇక సోమవారం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో వెటర్నరీ సబ్‌సెంటర్ భవనం, ప్రహరీ, బీసీ హాస్టల్ భవన నిర్మాణాలతో పాటు మధ్యాహ్నం ఖమ్మం రోటరీనగర్‌లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
‘ఆపదమిత్ర’లుగా శిక్షణ
ఖమ్మం రాపర్తినగర్: నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, మేరా యువ భారత్ ఆధ్వర్యాన యువతకు ‘ఆపదమిత్ర’లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు నెహ్రూ యువక కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. వరదలు, భూకంపాలు తదితర విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టే భద్రతా దళాలకు అండగా నిలిచేలా యువతకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఖమ్మంలో వారం పాటు జరిగే శిక్షణలో పాల్గొన్న వారికి ఎమర్జెన్సీ కిట్‌తో పాటు సర్టిఫికెట్ అందిస్తామని తెలిపారు. జిల్లా వాసులై 18–40 ఏళ్ల వయస్సు కలిగి కనీస విద్యార్హత ఉన్న యువత ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలోని మై భారత్ కార్యాలయం(నెహ్రూ యువ కేంద్రం)లో లేదా 99517 45203 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
నిమజ్జన ఘాట్లు పరిశీలించిన అడిషనల్ డీసీపీ
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం శనివారం జరగనుండగా ఘాట్ల వద్ద ఏర్పాట్లను శుక్రవారం అడిషనల్ డీసీపీ ప్రసాదరావు పరిశీలించారు. కాల్వొడ్డు, ప్రకాశ్ నగర్, ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా వైపు మున్నేటి తీరాన నిమజ్జనం ఘాట్లను పరిశీలించిన ఆయన ఏర్పాట్లు, భద్రతపై సూచనలు చేశారు. అలాగే, వాహనాల రాకపోకలకు ఇక్కట్లు ఎదురుకాకుండా బందోబస్తు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
నేడు ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితాలను మండల పరిషత్ కార్యాలయాలతో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శిస్తారు. ఈ జాబితా ఆధారంగా జిల్లాలో 8,02,690మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుండగా, పోలింగ్ బూత్‌ల సంఖ్య 1,572 నుంచి 1,580కి పెరగనుంది. ఆతర్వాత అభ్యంతరాలు స్వీకరించి పరిశీలన అనంతరం ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.
జాతీయ స్థాయి పోటీలకు ‘కస్తూరి తిలకం’
మధిర: ఏపీలోని తెనాలిలో కళల కాణాచి సంస్థ ఆధ్వర్యాన ఈనెల 27 నుంచి అక్టోబర్ 2 వరకు జాతీయ స్థాయి పద్య నాటక పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మధిర కళాకారులు రూపొందించిన కస్తూరి తిలకం పద్య నాటకం ఎంపికై ంది. ఈ నాటకాన్ని శారదాప్రసన్న రచించగా, డాక్టర్ సుబ్బరాజు దర్శకత్వంలో ప్రదర్శించనున్నారు. వివిధ పాత్రలను చిలువేరు శాంతయ్య, ఇనుపనూరి వసంత్, నరాల సాంబశివారెడ్డి, రాజేశ్వరరావు, తిరువూరు ప్రసాద్, కోటిరెడ్డి పోషిస్తారు. జిల్లా నుంచి రెండు నాటకాలను పరిశీలించగా కస్తూరి తిలకం ఎంపికై ందని సుమిత్ర యూత్ ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు తెలిపారు.