
రోజూ 30లక్షల మందికి ‘మహాలక్ష్మి’
సత్తుపల్లిటౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజూ సుమారు 50లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా, మహాలక్ష్మి పథకం ద్వారా 30లక్షల మందికి పైగా మహిళలు ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ కరీంనగర్‌జోన్ ఈడీ సోలోమన్ తెలిపారు. తద్వారా ఈ పథకం సంస్థకు వరంలా మారిందని వెల్లడించారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపోను ఖమ్మం ఆర్‌ఎం ఏ.సరిరామ్‌తో కలిసి శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడారు. ఉద్యోగులు ప్రయాణికులతో గౌరవంగా వ్యవహరిస్తూ వారి మన్ననలు పొందాలని సూచించారు. ప్రజలను సురక్షితంగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా విధినిర్వహణ ఉండాలని తెలిపారు. కాగా, పురుష ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సు సర్వీసులు నడిస్తున్నామని చెప్పారు. కాగా, డబుల్ డ్యూటీలు ఎక్కువగా వస్తున్నాయన్న డ్రైవర్లు, కండక్టర్ల విజ్ఞప్తితో కొందరు సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో తీసుకున్నట్లు ఈడీ తెలిపారు.
సత్తుపల్లి డిపో ఆదర్శం
పరిశుభ్రత, కేఎంపీఎల్, విధి నిర్వహణతో పాటు అన్ని విభాగాల్లో సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఆదర్శంగా నిలిచిందని ఈడీ సోలోమన్ తెలిపారు. సమష్టిగా కష్టపడడంతో ఇది సాధ్యమైందని ఉద్యోగులను అభినందించారు. శ్రీరామనవమి సందర్భంగా తలంబ్రాల బుకింగ్‌లో సత్తుపల్లి డిపో రీజియన్‌లో ప్రథమస్థానాన నిలవగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.కే.మునీర్‌పాషా, సిబ్బంది కిన్నెర ఆనంద్, జైపాల్‌ను సత్కరించారు. డిప్యూటీ ఆర్‌ఎం వి.మల్లయ్య, డీఎం యు.రాజ్యలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, ఎంఎఫ్ సాహితితోపాటు సూపర్‌వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్