
సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు
● రెండు కి.మీ. మేర కొట్టుకుపోయిన వాహనం ● డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి మృతి
ఖమ్మంరూరల్: రూరల్ మండలంలోని గొల్లగూడెం వద్ద సాగర్ కాల్వలోకి ఓ కారు దూసుకెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వరంగల్ వైపు నుండి ఖమ్మం వైపు వస్తున్న కారు అతివేగంగా ఉండడంతో అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ విషయమై యువకులు ఇచ్చిన సమాచారంతో రూరల్ సీఐ ముష్క రాజు సిబ్బందితో చేరుకుని క్రేన్‌ను రప్పించారు. కాల్వలో ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కారు రెండు కి.మీ. మేర కొట్టుకుపోయింది. చివరకు క్రేన్‌తో కారును బయటకు లాగారు.
డోర్లు తెరుచుకోక...
కారుడోర్లు లాక్ అయి ఉండగా కాల్వలో పడగానే అందులోని వ్యక్తి బయటపడే అవకాశం లేకపోయిందని తెలుస్తోంది. కారును బయటకు తీసి అద్దాలు పగులగొట్టే లోగా డ్రైవర్ సీటులో కూర్చున్న వ్యక్తి మృతి చెందాడు. కారు నంబర్ ఆధారంగా పెదతండాకు చెందిన మర్లపాటి వెంకటేశ్వర్లు పేరిట రిజిస్ట్రేషన్ అయిందని గుర్తించారు. అయితే, ప్రమాదంలో మృతి చెందింది యాజమానా, మరొకరా అన్న విషయమై ఆరా తీస్తున్నట్లు సీఐ తెలిపారు. తొలుత కారులో పలువురు ఉన్నారని భావించినా తలుపులన్నీ లాక్ అయి ఉండడంతో ఒకరు మాత్రమే వస్తున్నట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో తరలించారు.
20ఏళ ్ల క్రితం ఇక్కడే ప్రమాదం
ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోటే 20ఏళ ్ల క్రితం ప్రైవేట్ బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. పిండిప్రోలు – ఖమ్మం మధ్య నడిచే బస్సులో ఉన్న 25మంది మృతిచెందిన విషయాన్ని స్థానికులు గుర్తుచేసుకున్నారు.

సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు