
ప్రజలు కలిసొస్తేనే పరిశుభ్రత
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రజలు కూడా కలిసిరావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం 57వ డివిజన్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన శుక్రవారం పర్యటించారు. రమణగుట్ట, దివ్యాంగుల కాలనీ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఖాళీ ప్రాంతాలను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోకుండా యాజమాలకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఒకవేళ ఎవరైనా స్పందిచకపోతే కేఎంసీ ఆధ్వర్యాన శుభ్రం చేయించి జరిమానా విధించాలని చెప్పారు. అనంతరం దివ్యాంగుల కాలనీలో శిథిలావస్థకు చేరిన బాలకార్మిక ప్రత్యేక పాఠశాలను పరిశీలించిన కలెక్టర్.. సమీపంలోని ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాల భవనాన్ని తొలగించి అక్కడ ఆధునికమైన ప్లే స్కూల్, అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణంపై ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఇదేసమయాన విద్యార్థుల బోధనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కార్పోరేటర్ రఫీదా బేగం ముస్తఫా, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి