
పెద్దాస్పత్రిలో సేవలకు అంతరాయం
● ఆర్‌ఓ ప్లాంట్ మరమ్మతుతో నిలిచిన హబ్ సేవలు ● విద్యుత్ లోపంతో సీటీస్కాన్ సేవలకూ విఘాతం
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. వ్యాధి నిర్ధారణలో కీలకమైన తెలంగాణ డయాగ్నస్టిక్, సీటీ స్కాన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోజూ వేలాదిగా వచ్చే ప్రజల్లో కొందరు వెనుతిరుగుతున్నారు. ఇంకొందరు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.
శుద్ధి చేసిన నీరు లేక...
ఖమ్మం జనరల్ ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడ 1,520 రకాల పరీక్షలకు అవకాశం ఉండగా, జిల్లా నలుమూలల నుంచి 40సెంటర్ల ద్వారా ఐదు వాహనాల్లో శాంపిళ్లు తీసుకొస్తారు. పరీక్ష చేశాక సంబంధిత వ్యక్తుల ఫోన్‌కు 24 గంటల్లో నివేదిక పంపిస్తారు. ఆపై వైద్యులకు చూపిస్తే చికిత్స మొదలవుతుంది. ఇటీవల రసాయనాల కొరతతో తరచూ టెస్టులకు ఆటంకం కలుగుతోంది. ఇప్పుడు ఆర్‌ఓ ప్లాంట్ మర్మమతుకు రావడంతో నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. డయాగ్నస్టిక్ హబ్‌లో శుద్ధి చేసిన నీటితో పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీరోజు 10వేల లీటర్ల నీరు అవసరం కాగా, ఆర్‌ఓ ప్లాంట్ మూలనపడడంతో పరీక్షలు నిలిచిపోయాయి.
సీటీ స్కాన్ సేవలకు బ్రేక్
పెద్దాస్పత్రిలోని ట్రాన్స్‌ఫార్మర్ నుంచి స్కానింగ్ గదికి విద్యుత్ సరఫరా చేసే వైర్లు తెగిపోవడంతో సీటీ స్కాన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం స్కానింగ్ మిషన్‌ను అందుబాటులోకి తీసుకురాగా నిత్యం 25–30 మందికి స్కానింగ్ చేస్తుంటారు. ప్రస్తుతం వైర్లు తెగడంతో బుధవారం నిపుణులను పిలిపించి మరమ్మతు చేయించాక పరీక్షలు మొదలయ్యాయి. కానీ గురువారం ఉదయంకల్లా మళ్లీ స్కానింగ్ మిషన్ ఆన్ కాకపోవటంతో సేవలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో పలువురు నిరాశతో వెనుతిరిగిపోవడం కనిపించింది. ఇంకొందరు ఆర్థికంగా భారమైనా ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్‌ను వివరణ కోరగా హైదరాబాద్ నుంచి నిపుణులను పిలిపించి ఆర్‌ఓ ప్లాంట్ మరమ్మతు చేయిస్తామని తెలిపారు, అప్పటివరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వ్యాఽధి నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక సీటీ స్కాన్ సేవలు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు.