
బిల్లు తారుమారుపై అధికారుల విచారణ
కామేపల్లి: మండలంలోని రేపల్లెవాడలో ఓ వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి ఖాతాలో నగదు జమ కావడంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ విషయమై గత నెల 30న ‘సాక్షి’లో ‘ఇందిరమ్మ బిల్లు మరొకరి ఖాతాలో!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. గ్రామానికి చెందిన తేజావత్ రవికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఎమ్మెల్యే చేతుల మీదుగా పత్రం అందజేయగా ఆయన పునాది వరకు నిర్మించాక రూ.లక్ష బిల్లు మంజూరు కావాల్సి ఉంది. కానీ అదే గ్రామంలో తేజావత్ రవి పేరుతో ఉన్న మరో వ్యక్తి ఖాతాలో జమ కావడం.. ఇల్లు తనకే మంజూరైనా పత్రాన్ని మరొకరికి ఇచ్చారని రెండో వ్యక్తి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు రేపల్లెవాడలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్ పర్యటించారు. పునాది నిర్మించిన వ్యక్తి పేరిట కాక నగదు జమ అయిన రవికే ఇల్లు మంజూరైందని తేల్చారు. కాగా, ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. గ్రామానికే చెందిన గుగులోత్ రాజా ఇంటి మంజూరు పత్రం అందుకుని నిర్మాణం చేపట్టగా గుగులోత్ రాజు పేరుతో ఉన్న మరో వ్యక్తికి ముందుకు రావడంతో బిల్లు నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు, మంజూరు పత్రాల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని పలువురు ఆరోపించారు. దీంతో నిర్మాణం చేపట్టిన వారికి మరో విడతలో వారికి అవకాశం కల్పించనున్నట్లు పీడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఏఈఉ నాగేందర్, సౌమ్య పాల్గొన్నారు.

బిల్లు తారుమారుపై అధికారుల విచారణ