అంకితభావం.. ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

అంకితభావం.. ఆదర్శం

Sep 5 2025 5:28 AM | Updated on Sep 5 2025 5:28 AM

అంకిత

అంకితభావం.. ఆదర్శం

● విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు ● ప్రభుత్వ పాఠశాలల్లో విలక్షణ పద్ధతుల్లో బోధన, శిక్షణ ● క్రీడల్లోనూ జాతీయస్థాయిలో ప్రతిభ చూపేలా తర్ఫీదు

● విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు ● ప్రభుత్వ పాఠశాలల్లో విలక్షణ పద్ధతుల్లో బోధన, శిక్షణ ● క్రీడల్లోనూ జాతీయస్థాయిలో ప్రతిభ చూపేలా తర్ఫీదు
నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

ప్రభుత్వ పాఠశాలల్లోని పలువురు ఉపాధ్యాయులు అంకితభావంతో పాఠాలు చెబుతున్నారు. సులభమైన పద్ధతుల్లో బోధన చేపడుతున్నారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీస్తున్నారు. విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నారు. క్రీడారంగంలోనూ తీర్చిదిద్దుతున్నారు. భావిభారత నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అలాంటి కొందరు గురువులపై ప్రత్యేక కథనం.

కట్టా.. విద్యాసేవకే జీవితం

ఖమ్మం సహకారనగర్‌: ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమేనని విశ్వసిస్తూ తన జీవితాన్ని బోధనకే అంకితం చేసిన ఉపాధ్యాయుడు కట్టా వెంకటేశ్వర్లు. ఇటీవలే ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో ఎస్‌ఏ(బయాలజికల్‌ సైన్స్‌)గా బాధ్యతలు స్వీకరించిన ఎక్కడ పనిచేసినా విద్యార్థుల సంఖ్య పెంపు, సౌకర్యాల కల్పన, బోధన సృజనాత్మకతే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. 1997 జూన్‌ 30న గోరీలపాడు తండా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ప్రస్తానం ప్రారంభించిన ఆయన విజయ్‌రావుతో కలిసి విద్యార్థుల సంఖ్యను 50 నుండి 120కి పెంచారు. ఆ పాఠశాలలో 70కి పైగా నాటిన టేకు మొక్కలు ఇప్పుడు పెద్దవయ్యాయి. ఇక 2004లో ఖమ్మం గుట్టలజార్‌ పాఠశాలకు వచ్చాక సృజనాత్మకతను జోడించి సైన్స్‌ మోడళ్ల బోధన ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఆపై 2011 జూన్‌లో కొత్తగూడెంకు, 2015లో ఖమ్మం సంభానినగర్‌ పాఠశాలకు బదిలీపై అయిన వెంకటేశ్వర్లు ఆ పాఠశాలలో 95గా విద్యార్థుల సంఖ్యను 150కి చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. అప్పుడే టీఎల్‌ఎంలో బహుమతులు సాధించారు. కాగా, ఆయన పనిచేసిన పాఠశాలల్లో దాతల చేయూతతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటుచేయగా, 2019లో రూ.1.20లక్షల విలువైన 75 డెస్క్‌ బెంచీలు సమకూర్చారు. స్వచ్ఛ భారత్‌ వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకునేలా మార్గనిర్దేశం చేశారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చడానికి ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో కృషి చేశారు.

ఖమ్మం ద్రోణాచార్యుడు.. గౌస్‌

ఖమ్మం స్పోర్ట్స్‌: అథ్లెటిక్స్‌లో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా శిక్షణ ఇస్తున్న ఖమ్మం అథ్లెటిక్స్‌ అకాడమీ కోచ్‌ ఎం.డీ.గౌస్‌ అభినవ ద్రోణాచార్యుడిలా నిలుస్తున్నారు. మూడు దశబ్ధలుగా అథ్లెటిక్స్‌లో మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలుస్తున్నారు. ఆయన వద్ద శిక్షణ పొందిన పలువురు పోటీల్లో సత్తా చాటడమేకాక ఉన్నత ఉద్యోగాలు సాధించడం విశేషం. ఢిల్లీలో 2010లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో గౌస్‌ వద్ద శిక్షణ తీసుకున్న అబ్దుల్‌ ఖురేషి కాంస్య పతకం సాధిచాడు. నాటి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లో 1993లో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి 3వేల మందికిపైగా శిక్షణ ఇవ్వగా.. అందులో పది మంది అంతర్జాతీయస్థాయిలో పదికి పైగా పతకాలు సాధించారు. ఇక జాతీయస్థాయిలో ఏకంగా 400 మంది పతకాలు సొంతం చేసుకోవడం విశేషం. దాదాపు 300 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఎం.డీ.గౌస్‌ ప్రతిభకు స్పోర్ట్స్‌ అథారిటీ ప్రకటించిన ఉత్తమ కోచ్‌ అవార్డును నాటి గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా అందుకున్నాడు. ఎప్పటికై నా జిల్లా నుంచి ఒలింపిక్‌ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెప్పే గౌస్‌ కల నెరవేరాలని ఆశిద్దాం.

బోధన, సౌకర్యాల కల్పన.. జ్ఞాని

మధిర: జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా 23ఏళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన బాజోజు జ్ఞానేశ్వరాచారి ఎక్కడ పనిచేసినా బోధనతో సరిపెట్టుకోకుండా ఆ పాఠశాలలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మధిర మండలంలోని మడుపల్లి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్వరాచారి గతంలో భీమవరం, మాటూరు తదితర పాఠశాలల్లో విధులు నిర్వర్తించారు. ఆయా పాఠశాలల్లో సరైన తరగతి గదులు లేక విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి సహ ఉపాధ్యాయులు బూసా కోటేశ్వరావు సహకారంతో ఎన్నారైలు, గ్రామస్తులను ఒప్పించి పాఠశాలకు రెండెకరాల స్థలం వచ్చేలా చూశారు. ఆపై అధికారుల సహకారంతో నూతన భవన సముదాయాల నిర్మాణానికి కృషి చేశారు. అంతేకాక కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండడంతో పాఠశాలల్లో కంప్యూటర్‌ బోధనకు సహకరిస్తూనే అవసరమైన మరమ్మతులు సొంతంగా చేస్తారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులకు సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ ఇస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఇక నిరుపేద విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనేలా తర్ఫీదునిస్తారు. తీరిక సమయాన ఇంటి ఆవరణలో సేంద్రియ ఎరువులతో కూరగాయలు సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్న జ్ఞానేశ్వరాచారి.. మధిర ఎంప్లాయీస్‌ కాలనీలోని కుందా సావిత్రి సేవాసమితి హోమియో హాస్పిటల్‌లో వలంటీర్‌గా సేవలందిస్తున్నారు. ఇవికాక సొంతంగాతక్కువ ఖర్చుతో రూపొందించిన వాటర్‌ ప్యూరిఫయర్‌ను హోమియో ఆస్పత్రికి అందించారు. పాఠాల బోధనలో వినూత్న విధానాలు అవలంబిస్తూనే సేవా కార్యక్రమాల్లో ముందు నిలిచే ఆయన సతీమణి గురుకుల పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యేలా ప్రోత్సాహించారు. ఇప్పటివరకు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోకుండా దూరంగా ఉండడం విశేషం.

అంకితభావం.. ఆదర్శం1
1/4

అంకితభావం.. ఆదర్శం

అంకితభావం.. ఆదర్శం2
2/4

అంకితభావం.. ఆదర్శం

అంకితభావం.. ఆదర్శం3
3/4

అంకితభావం.. ఆదర్శం

అంకితభావం.. ఆదర్శం4
4/4

అంకితభావం.. ఆదర్శం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement