
డబ్బులిస్తేనే ‘సదరమ్’ సర్టిఫికెట్
● నగదు డిమాండ్ చేస్తున్న పలువురు ● విచారణ కమిటీ వేసిన సూపరింటెండెంట్
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సదరమ్ విభాగంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దివ్యాంగులకు వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్ జారీకి పలువురు డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అర్హత లేకపోయినా డబ్బు ముట్టజెపితే సదరమ్ సర్టిఫికెట్ చేతులో పెడుతున్నారని, డబ్బులు ఇవ్వకపోతే కొర్రీలతో జాప్యం చేసుప్తన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో సదరమ్ శిబిరాల నిర్వహణ ప్రత్యేక విభాగం ఉండగా ఇందులో డీఆర్‌డీఏ, ఆస్పత్రి సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. నిర్ణీత తేదీల్లో శిబిరాలు నిర్వహించే క్రమాన ముందు రోజు స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగుల సెల్‌కు మెసేజ్ పంపడమే కాక సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. ఆతర్వాత వైద్యులు పరీక్షించి అర్హత ఉన్న వారికి సర్టిఫికెట్ జారీ చేయడం ఆనవాయితీ. ఈక్రమంలో కొందరు సిబ్బంది దివ్యాంగులకు ఫోన్ చేసి సర్టిఫికెట్ జారీ చేసేందుకు కొంత నగదు ఇవ్వాలని సంప్రదిసున్నట్లు ఇటీవల అధికారులకు ఫిర్యాదులు అందాయి.
రూ.25వేలు ఇస్తేనే...
ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన ఓ వ్యక్తికి గతంలో సదరమ్ సర్టిఫికెట్ ఉంది. దీని కాలపరిమితి ముగియడంతో రెన్యువల్ కోసం గత నెల 26న క్యాంపునకు హాజరయ్యారు. ఆ శిబిరంలో ఆయన సర్టిఫికెట్ నిరాకరించారు. ఈ సమయాన సదరమ్ విభాగంలోని ఓ ఉద్యోగి ఆయనను ఫోన్‌లో సంప్రదించి రూ.25వేలు చెల్లిస్తే సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పినట్లు సమాచారం. దీంతో సదరు దివ్యాంగుడు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్‌కు ఫిర్యాదు చేయగా గురువారం ముగ్గురితో కూడిన కమిటీని విచారణకు నియమించారు. అంతేకాక దివ్యాంగుడిని పిలిపించి తన చాంబర్‌లో వైకల్య పరీక్షలు నిర్వహించగా సదరమ్ సర్టిఫికెట్‌కు అర్హత సాధించడం గమనార్హం. దివ్యాంగుల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తేనే ఈ దందాకు అడ్డుకట్ట పడుతుందని పలువురు కోరుతున్నారు.