
సుంకం రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ఖమ్మంమయూరిసెంటర్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి పత్తిపై దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం గర్హనీయమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు ఆరోపించారు. సుంకాన్ని రద్దుచేయడంతో పత్తి ధరలు తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదముందని తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యాన గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హేమంతరావు మాట్లాడుతూ పత్తి దిగుమతిపై సుంకాన్ని రద్దు చేసిన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 లక్షల హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేస్తుండగా, ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా నష్టపోతారని తెలిపారు. కాగా, 11ఏళ్ల మోడీ పాలనలో వ్యవసాయ రంగంపై వివక్ష తప్ప సానుకూల స్పందన ఏనాడు కనబర్చలేదని ఆరోపించారు. అలాగే, కేంద్రం తీరుతోనే యూరియా కొరత ఏర్పడిందని మండిపడ్డారు. అనంతరం వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి అందించారు. వివిధ పార్టీలు, సంఘాల నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, మాదినేని రమేష్, బొంతు రాంబాబు, మలీదు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనలో బాగం హేమంతరావు