
●పిల్లల ఉన్నతే ‘మోషే’ లక్ష్యం
సత్తుపల్లిటౌన్: ఆదర్శ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే మోషే మాదిరి ఉండాలని ముక్తకంఠంతో చెబుతారు సత్తుపల్లి మండలం బుగ్గపాడు పాఠశాల విద్యార్థులు. అంతలా వాళ్ల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానాన్ని పొందారు. ఈ ఉపాధ్యాయుడి పూర్తి పేరు కోండ్రు మోషె. గతంలో వేంసూరు తదితర మండలాల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించి ప్రస్తుతం బుగ్గపాడు పాఠశాలలో పని చేస్తున్నారు. బోధనలో సులభ పద్ధతులను అనుసరించే ఈయన ఆహార్యం, నడవడికలోనకు విద్యార్థులు ఆదర్శప్రాయంగా నిలిచారు. విద్యార్థులతో కలిసిమెలిసి ఆటలు ఆడతారు. వారితో మమేకమవుతూ ప్రయోగాలు చేయిస్తుంటారు. భోజన సమయంలో విద్యార్థులతోనే భోజనం చేస్తుండడంతో వారి మనస్సుల్లో స్థానం సాధించుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలు, వర్కుబుక్స్ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేలా ఉన్నాయని చెప్పే ఆయన.. ఇంకొంత సృజనాత్మకతతో పాఠాలు బోధిస్తుండడం విశేషం. ఉపాధ్యాయుడు సహనం, సహానుభూతి అలవర్చుకుని.. అంకితభావంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయని.. తరగతి గదిలో అద్భుతాలు సృష్టించవచ్చని మోషే ప్రగాఢంగా నమ్ముతారు.