
మహిళా అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి
● పెట్రోల్ బంక్ ఏర్పాటుకు స్థలాల ఎంపిక ● అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ
ఖమ్మంమయూరిసెంటర్: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆమె తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, కొత్త స్వశక్తి సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ రుణాలు, ఏకరూప దుస్తుల తయారీ, ఎర్రుపాలెం, కల్లూరులో సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుపై సమీక్షించారు. అక్షరాస్యత పెంచే దిశగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించని మహిళలను గుర్తించి ఓపెన్ స్కూల్ సొసైటీలో నమోదు చేయాలని తెలిపారు. ఏపీఎంల వారీగా లక్ష్యాలను చేరకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, జిల్లాలో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని, సత్తుపల్లిలో స్థలం ఖరారైనందున బంక్ ఏర్పాటు పనులు మొదలుపెట్టాలని సూచించారు. ఇక నూతన స్వశక్తి మహిళా సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు, చెల్లింపులపై సూచనలుచేశారు. అడిషనల్ డీఆర్‌డీఓ జయశ్రీ, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు.
విపత్తు నిర్వహణ పనులపై నివేదిక
ఖమ్మం సహకారనగర్: భారీవర్షాలు, వరదల కారనంగా జరిగిన నష్టం, విపత్తు నిర్వహణ నిధుల కింద చేపట్టిన పనులు వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ధనసరి అనసూ య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరా వు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుండి సోమవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వరదలతో దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, కుంటల మరమ్మతుకు కార్యాచరణ రూపొందించా లని తెలిపారు. వీసీకి జిల్లా నుంచి సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, డీఏఓ పుల్లయ్య, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు వెంకటేశ్వర్లు, యాకోబు, సీపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు సన్మానం
జిల్లాలో పాలన సాఫీగా సాగడంలో అధికారుల పాత్ర కీలమని అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆగస్టులో ఉద్యోగ విరమణ చేసి న 10 మంది అధికారులు, ఉద్యోగులను సోమవా రం కలెక్టరేట్‌లో వారు సన్మానించారు. ఎస్సీ డీడీ కస్తాల సత్య నారాయణ, ముదిగొండ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల ఉద్యోగులు చాంద్ పాషా, వెంకటేశ్వరరావు, కొర్ర శివ, సాంబశివరెడ్డి, పూలమ్మ, పి.రాజ్యలక్ష్మి, నరసింహాం, అబ్దుల్ హఫీజ్ తదితరుల సన్మానించాక అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసినా పాలన సాఫీగా సాగేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.