
మున్నేరుకు మరోసారి వరద
ఖమ్మంమయూరిసెంటర్: గతేడాది సెప్టెంబర్ 1న ప్రళయం సృష్టించిన మున్నేరు ఈ ఏడాది ఇప్పటివరకు శాంతంగానే ఉన్నా... పరీవాహకంలో భారీ వర్షాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారం క్రితం కాల్వొడ్డు వద్ద 15.10 అడుగుల మేర ప్రవహించిన మున్నేరు ఆతర్వాత తగ్గినా మళ్లీ సోమవారం అదే స్థాయికి చేరింది. ఆదివారం రాత్రి ఖమ్మంకు ఎగువన మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో దాదాపు 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో సోమవారం మున్నేరుకు వరద పెరగగా ఉదయం 8గంటలకు కాల్వొడ్డు వద్ద 9.10 అడుగుల మేర ఉన్న నీటిమట్టం రాత్రి 8 గంటలకల్లా 14.90 అడుగులకు పెరిగింది. దీంతో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను అప్రమత్తం చేశారు. అయితే, డోర్నకల్, పొలిశెట్టిగూడెం అక్వాడెక్ట్‌లు, తీర్థాల వద్ద మున్నేరు పెరుగుతున్నట్లు కనిపించినా ఆ తర్వాత నిలకడగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాల్వొడ్డు వద్ద వరద 15 అడుగుల వరకు చేరాక తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, రాత్రి వరద పెరిగితే వెంకటేశ్వరనగర్ చర్చిలో అలారం మోగిస్తామని, ఆ వెంటనే ప్రజలు అప్రమత్తమై ఇళ్ల నుండి బయటకు రావాలని ఆర్డీఓ నర్సింహారావు సూచించారు. మున్నేటి పరీవాహక ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఆయనతోపాటు ఎస్‌ఈ రంజిత్, ఈఈ కృష్ణాలాల్, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు పర్యటించారు.