
కాళరాత్రికి ఏడాది
పరీవాహక బాధితులను
ఇంకా వీడని భయం
ఇప్పటికీ పలు చోట్ల ఖాళీగానే ఇళ్లు
రిటైనింగ్ వాల్ పూర్తయితే
గట్టెక్కుతామని నమ్మకం
ఎగువన భారీ వర్షాలతో గతేడాది ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 1 తెల్లవారుజామున 3 గంటల వరకు 19 అడుగులుగా ఉన్న మున్నేరు వరద ఉదయం 11 గంటలకల్లా 36.9 అడుగులకు చేరింది. గంటకు 3 – 4 అడుగుల మేర పెరుగుతూ ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. అయితే, ఇక్కడ వరద 36.9 అడుగులు కాదు 41 అడుగులకు చేరిందని అధికారులు ఆ తర్వాత ప్రకటించారు. అనూహ్యంగా వరద రావడంతో ఖమ్మం నగరం, ఖమ్మంరూరల్ మండలంలోని 60 కాలనీల ప్రజలు కనీస సామగ్రి తీసుకునే వీల్లేకుండానే పునరావాస కేంద్రాలకు వెళ్లారు. వీరిలో అత్యధికంగా రోజువారీ కూలీలే కాగా.. ఇళ్లలో బురద మేటలు వేసి కొన్ని చోట్ల పూర్తిగా, ఇంకొన్ని చోట్ల పాక్షికంగా నేలమట్టమయ్యాయి. పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న గ్యాస్‌స్టౌలు, బియ్యం, మంచాలు, దుప్పట్లు, ఫ్రిడ్జ్‌లు, బీరువాలు తదితర సామగ్రి, దాచుకున్న సొమ్ము తుడిచిపెట్టుకుపోయింది.
మునుపెన్నడూ లేని రీతిలో గత ఏడాది మున్నేటికి వరద రాగా ప్రభావిత కాలనీల ప్రజలు ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటుపడుతున్నారు. అయినా చిన్నపాటి వర్షం కురిస్తే చాలు.. ఉలిక్కిపడుతున్నారు. ప్రస్తుత వర్షాలతో మళ్లీ ఎక్కడ వరద వస్తుందోనన్న ఆందోళనతో వారిలో కంటి మీద కునుకు కరువవుతోంది. ప్రస్తుతం మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుండడం కొంత ఊరట కలిగిస్తోంది.
వరదల సమయాన ఇంటింటా అధికారులు వివరాలు సేకరించారు. ఒక్కో కుటుంబానికి రూ.16,500 చొప్పున 9,725 మందికి రూ.15,60,30,000 ఆర్థిక సాయం అందినా 2,170 కుటుంబాలకు ఎదురుచూపులే మిగిలాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతేనే వీరికి సాయం అందనుంది.
గతేడాది ఇదేరోజు
ముంచెత్తిన మున్నేరు