
సీఎంఆర్.. ఇక స్పీడ్
వేగవంతం చేస్తున్నాం
● బియ్యం సేకరణపై యంత్రాంగం దృష్టి ● క్షేత్రస్థాయిలో మిల్లులకు వెళ్లి పరిశీలన
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) వసూళ్లను వేగవంతం చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. గడువు ముగుస్తున్న క్రమంలో సీఎంఆర్ త్వరితగతిన ఇవ్వాలని మిల్లర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈనెల 12 వరకు గడువు ఉండగా ఈలోపే 100 శాతం సీఎంఆర్ వసూలు చేయాలని నిర్ణయించుకుని.. క్షేత్రస్థాయికి వెళ్తున్నారు.
2.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
కొనుగోలు..
2024 – 25 సంవత్సర ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని 21 మండలాల పరిధిలో 2,80,364.540 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించారు. ఇందులో 67 శాతం అంటే.. 1,87,844.242 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖకు సీఎంఆర్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 1,66,448.752 మెట్రిక్ టన్నులు అందించగా 21,338.489 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఈనెల 12వ తేదీ లోపే మొత్తం బియ్యం సేకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
రబీలోనూ పెండింగే..
2024 – 25 సంవత్సర రబీలోనూ మిల్లర్లు ఇవ్వాల్సిన సీఎంఆర్ పెండింగ్‌లోనే ఉంది. ఈ సీజన్‌లో 1,60,558 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 52,243.663 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఇవ్వగా.. ఇంకా 56,133.337 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంది. కాగా మొత్తంగా ఇప్పటివరకు మిల్లర్లు 48 శాతం బియ్యమే అప్పగించగా.. గడువు సమీపిస్తున్న క్రమంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
జిల్లాలో బియ్యం సేకరణ వేగవంతం చేస్తున్నాం. ఈ నెల 12వ తేదీ వరకు గడువు ఉంది. ఈ మేరకు పెండింగ్ ఉన్న సీఎమ్మార్‌ను త్వరగా ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించాం. క్షేత్రస్థాయిలో సైతం మిల్లులను తనిఖీ చేసి బియ్యం వెంటనే అప్పగించేలా ఒత్తిడి పెంచుతున్నాం.
– చందన్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి

సీఎంఆర్.. ఇక స్పీడ్