
రికార్డు సమయంలో ‘ఎత్తిపోతలు’
● త్వరగా పూర్తయిన ప్రాజెక్టుగా మంచుకొండ లిఫ్ట్ ● రూ.66 కోట్ల నిధులతో నాలుగు నెలల్లో నిర్మాణం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని చెరువులకు నీరు సరఫరా చేసి, ఆయకట్టుకు అందించేలా వీ.వీ.పాలెం సాగర్‌ప్రధాన కాల్వలపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం రికార్డు సమయంలో పూర్తయిందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. రూ.66 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. సాగర్ ప్రధాన కాల్వపై ఏర్పాటు చేసిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మండలంలోని అన్ని చెరువులకు పైప్‌లైన్ల ద్వారా నీరు చేరుస్తారు. పంప్ హౌస్ నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు, మోటార్లు, పంపు సెట్ల ఏర్పాటు వంటి కీలక పనులన్నీ అతి తక్కువ సమయంలో పూర్తయిన ఎత్తిపోతల పథకం రాష్ట్రంలో ఇదే మొదటిదని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ శాఖ నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు, శాఖ రాష్ట్ర సలహాదారుడు పెంటారెడ్డి పర్యవేక్షణలో కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు రాత్రీపగలు తేడా లేకుండా పనులు చేపట్టడంతో ఈ ఫలితం నమోదైందని భావిస్తున్నారు. అంతేకాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతరం పర్యవేక్షిస్తుండడంతో పనులు వేగంగా జరిగాయి. ఇప్పటికే మూడు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తవగా.. త్వరలోనే విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించి మండలంలోని చెరువులకు, ఆపై ఆయకట్టుకు నీరు సరఫరా చేయనున్నారు.
రైతుల్లో ఆనందం
రఘునాథపాలెం మండలంలోని చెరువులకు మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ జలాలు వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మండలంలో ఇన్నాళ్లు వర్షాధారంగానే చెరువులు నిండుతుండగా, సాగుకు ఇబ్బంది ఎదురుకావొద్దని మంచుకొండ వద్ద సాగర్ ప్రధాన కాల్వపై ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఈ పథకంలోని మూడు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతం కాగా, డెలివరీ పాయింట్ వద్దకు నీరు చేరుతోంది. ఈమేరకు రైతులు, నాయకులు శనివారం డెలివరీ పాయింట్ వద్ద సంబురాలు చేసుకున్నారు. అంతేకాక సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పుష్పాభిషేకం చేశారు. అలాగే, పథకాన్ని రికార్డు సమయాన పూర్తిచేయడంలో కీలకంగా వ్యవహరించిన జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం మార్కెట్, ఆత్మ కమిటీ, పీఏసీఎస్ చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, తాతారావుతో పాటు నాయకులు వాంకుడు దీపక్‌నాయక్, కొంటెముక్క నాగేశ్వరరావు, బాలాజీనాయక్, కేలోత్ దేవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.