
గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన
సత్తుపల్లిరూరల్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించేందుకు జాతీయ స్థాయి పర్యవేక్షణ(ఎన్‌ఎల్‌ఎం) బృందం సత్తుపల్లి మండలంలోని నారాయణపురం, కాకర్లపల్లి గ్రామాల్లో శనివారం పర్యటించింది. ఈ సందర్భంగా ఉపాధిహామీ కూలీలు, గ్రామ సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ఉపాధి హామీ పనులతో లబ్ధి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు అందుతున్న పింఛన్లపై ఆరా తీశారు. అలాగే, గ్రామాల్లో రోడ్ల వెంట నాటిన మొక్కలు, ఫీడర్ ఛానల్ పూడికతీత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పను లను పరిశీలించారు. కేంద్ర బృందంలో డాక్టర్ గరుడ, ఎన్.అశ్విన్ గోపాల్ తదితరులు ఉండగా, కల్లూరు ఏపీడీ చలపతిరావు, ఎంపీడీఓ చిన్ననాగేశ్వరరావు, డీఈ వెంకటేశ్వరరావు, ఏపీ ఓ బాబురావు, ఏపీఎం కృష్ణయ్య పాల్గొన్నారు.
పత్తి, పెసరలో తెగుళ్ల నివారణపై అవగాహన
కొణిజర్ల: కొణిజర్లలో సాగవుతున్న పత్తి, పెసర పంటలను వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు డాక్టర్ వి.చైతన్య, డాక్టర్ పీఎస్‌ఎం.ఫణిశ్రీ, విజయ తదితరులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వరుస వర్షాలతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పత్తి చేన్లలో నీరు చేరితే వేరుకుళ్లు తెగులు రానున్నందున కాల్వలు కొట్టి నీరు తొలగించాలని సూచించారు. అలాగే, ఎకరాకు 25 కేజీల యూరియా, 20 కేజీల పొటాష్ మొక్క సమీపాన చల్లి మట్టి కప్పాలని, నేల ద్వారా తెగుళ్లు వ్యాప్తి చెందకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా యూరియాను నీటిలో వారానికి రెండు సార్లు పిచికారీ చేయాలని తెలిపారు. అంతేకాక పెసరలో ఆకుపచ్చ తెగులు నివారణకు కాపర్‌ఆక్సీ క్లోరైడ్ లేదా మంకోజాల్ పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏఓ బాలాజీ, ఏఈఓ శ్రీనివాసరాజు, రైతులు పాల్గొన్నారు.

గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన