
భూమి ఆధారంగా యూరియా పంపిణీ
తల్లాడ: తల్లాడ మండలం గంగదేవిపాడు సొసైటీ వద్ద శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. గంగదేవిపాడు సొసైటీకీ 15 టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో ఎనిమిది గ్రామాల నుంచి పాస్‌బుక్, ఆధార్‌కార్డ్ జిరాక్స్‌లతో ఉదయమే చేరుకున్నారు. దీంతో అందరికీ యూరియా సరఫరా చేయాలనే భావనతో ఎకరం భూమి కలిగిన రైతుకు ఒకటి, 5 – 10 ఎకరాలు ఉంటే రెండు బస్తాల చొప్పున పంపిణీకి నిర్ణయించారు. ఈమేరకు ఏఓ ఎం.డీ.తాజుద్దీన్‌తో కూపన్లు జారీచేయించగా పీఏసీఎస్ చైర్మన్ తూము వీరభద్రరావు, అధికారులు పర్యవేక్షించారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు...
ఖమ్మం వ్యవసాయం/ఖమ్మం రూరల్/తల్లాడ: వరుస వర్షాలతో పంటల సాగు పెరుగుతుండడంతో యూరియా అవసరం సైతం పెరుగుతోంది. దీంతో చాలాచోట్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు జిల్లా వ్యాప్తంగా గోదాంలు, సొసైటీల్లో తనిఖీ చేశారు. గోదాంలో ఉన్న స్టాక్, రిజిస్టర్లలో వివరాలను సరిపోల్చడమేకాక రైతులను ఇబ్బంది పెట్టకుండా సరఫరా చేయాలని డీలర్లకు సూచించారు. కాగా, తల్లాడ మండలం గంగదేవిపాడు, తల్లాడ సొసైటీల వద్ద యూరియా పంపిణీనీ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ పరిశీలించారు. స్టాక్ వివరాలు, ఇంకా అవసరమనే వివరాలు ఆరా తీశారు. అలాగే, ఖమ్మంరూరల్ మండలంలోని చినతండాలోని ఏదులాపురం పీఏసీఎస్ జిల్లా వ్యవసాధికారి ధనసరి పుల్లయ్య సందర్శించారు. గోదాంలో నిల్వ ఉన్న ఎరువులను తనిఖీ చేశాక నిర్వాహకులకు సూచనలు చేశారు. సరిపడా నిల్వలు ఉన్నందున రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు. అనంతరం పల్లెగూడెంలోని ఎరువుల షాపుల్లోనూ తనిఖీ చేయగాఏఓ ఉమానగేష్, పీఏసీఎస్ సీఈఓ మహమూద్‌అలీ, ఏఈఓలు పాల్గొన్నారు.
తల్లాడలో పరిశీలించిన సీపీ సునీల్‌దత్